Homeక్రైమ్వివాహేతర సంబంధం మోజులో దారుణం.. కన్న కొడుకుపై ప్రియుడుతో కలిసి తల్లి దాడి

వివాహేతర సంబంధం మోజులో దారుణం.. కన్న కొడుకుపై ప్రియుడుతో కలిసి తల్లి దాడి

క్రైం మిర్రర్ : చిత్తూరు జిల్లా వి.కోటలో సభ్య సమాజాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ ఏడేళ్ల చిన్నారిపై కన్నతల్లే దాడికి పాల్పడి చిత్రహింసలకు గురిచేసింది. తల్లితో పాటు ఆమెకు సన్నిహితంగా ఉన్న వ్యక్తి కలిసి బాలుడిని తీవ్రంగా హింసించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వి.కోటకు చెందిన ఓ మహిళకు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల ఎర్రచేనుకు చెందిన రాజు అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో రాజు తరచూ వి.కోటకు వచ్చి ఆ మహిళను కలుస్తుండేవాడని తెలుస్తోంది.

అయితే వీరి కలయికకు కుమారుడు అడ్డుగా మారుతున్నాడనే భావనతో చిన్నారిని ఇంటి నుంచి దూరం చేయాలని ఇద్దరూ ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బాలుడిపై తరచూ దాడి చేస్తూ వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. తాజాగా శుక్రవారం బాలుడిపై దారుణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో అతడు పెద్దగా ఏడుస్తూ కేకలు వేశాడు. దీంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై ఇంటికి వెళ్లి చూడగా, బాలుడు రక్తపు గాయాలతో కనిపించాడు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకుని బాలుడిని రక్షించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై వి.కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడిపై జరిగిన దాడికి గల పూర్తి కారణాలు, ఇందులో ఎవరి ప్రమేయం ఎంతవరకు ఉందనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చిన్నారిపై ఇంతటి దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు