•వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడిపోయిన ఓటు బ్యాంక్
•ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా వరకు తగ్గిన గ్రాఫ్
•గుంటూరులో యధాతధం
•గ్రేటర్ రాయలసీమలో స్వల్పంగా పెరిగిన ఓటు షేర్
•సొంత సర్వేలో వెల్లడి
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:-
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని బలంగా చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఈ విషయం స్వయంగా ఆ పార్టీ తాజాగా చేసిన సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. ఏపీలో పార్టీ పరిస్థితి అస్సలు బాగాలేదని.. గతం కంటే గ్రాఫ్ తగ్గుతోందని సర్వేలో తేలడం సంచలనంగా మారింది. గత పది రోజులుగా పార్టీలో ఇదే హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తోంది.
బయట వ్యక్తులతో సర్వే..
సాధారణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సర్వేలు అనేది ఆ పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తుంటారు. లేకుంటే ఋషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐప్యాక్ టీం సర్వేలు చేపడుతూ ఉంటుంది . చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే రాష్ట్రవ్యాప్తంగా 150 మంది యువకులను ఏర్పాటు చేసుకుని సర్వే చేస్తుంటారు. ఐపాక్ టీం డిజిటల్ ప్లాట్ఫారం వేదికగా ఈ సర్వేలు కొనసాగిస్తూ ఉంటుంది. అయితే మొన్నటి ఎన్నికల్లో ఆ రెండు సర్వేల ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. అందుకే జగన్మోహన్ రెడ్డి బయట వ్యక్తులతో సర్వేలు చేయిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దఎత్తున ప్రజా వ్యతిరేకత ఉందని జగన్మోహన్ రెడ్డి భావించారు. దానిని తెలుసుకునేందుకే రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయించారు. అయితే ఆ సర్వే ఫలితాల్లో ఆసక్తికరంగా మారాయి. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పక్కన పెడితే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అమాంతం పడిపోయినట్లు తెలుస్తోంది. రాయలసీమ మినహా మిగతా ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుకు గణనీయంగా గండి పడినట్లు తేలడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.
పడిపోయిన ఓటు బ్యాంక్..
శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మూడు శాతం ఓటు బ్యాంకు తగ్గినట్లు ఆ సర్వేలో తేలింది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి, కృష్ణాజిల్లాలో కేవలం రెండు అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక ఎంపీ సీటు వచ్చింది. కానీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో పూర్తిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనుకబడినట్లు తేలింది. ఉభయగోదావరి జిల్లాలో సైతం పార్టీ పరిస్థితి ఏమంత బాగాలేదని స్పష్టమైంది. కృష్ణాజిల్లాలో పరిస్థితి మరింత దిగజారినట్లు తేలింది. గుంటూరు జిల్లాలో గత ఎన్నికల్లో ఉన్న పరిస్థితి కొనసాగుతోందని తేలింది. ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించే విషయం.
రాయలసీమ పర్వాలే..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన రాయలసీమలో ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడినట్లు తేలడం విశేషం. అయితే అక్కడ నుంచి మూడు నుంచి నాలుగు శాతం ఓటు బ్యాంకు పెరిగినట్లు తాజా సర్వేలో వెల్లడయింది. నెల్లూరు తో పాటు ప్రకాశం జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే అక్కడ ఆ పార్టీ బలంగా ఉంది కాబట్టి.. గత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. పెరిగిన బలంతో 15 వరకు రావచ్చు. ప్రధానంగా కడప, రాజంపేట, కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో వైసిపి బలం పెరిగినట్లు ఈ సర్వేలో తేలింది. నెల్లూరులో ఒకటి రెండు చోట్ల బలం పెరిగినట్లు స్పష్టమైంది. అయితే రాయలసీమలో స్వల్ప ఉపశమనం దక్కిన… రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ పరిస్థితి దారుణంగా తయారు కావడం జగన్మోహన్ రెడ్డిని కలవర పెడుతున్నట్లు తెలుస్తోంది.
జగన్ ప్రకటనలతో..
రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రకటనలతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం అని తేలింది. నెల రోజుల కిందట ఆయన చేసిన మావిగన్ ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. మావిగన్ రాజధానిని మద్దతు తెలిపిన వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని.. అమరావతికి మద్దతు పలికిన వారు టిడిపి కూటమికి ఓటు వేస్తారు అన్న జగన్ మాట ఎక్కువ చేటు తెచ్చినట్లు ఈ సర్వేలో తేలినట్లు సమాచారం. రాజధానుల విషయంలో తరచూ స్టాండ్లు మార్చుతుండడం.. ఆపై ప్రజా పోరాటాలు లేకపోవడం.. ఆ పార్టీ నేతలు క్రియాశీలకం కాకపోవడం మైనస్ గా ఈ సర్వేలో తేలింది. మొత్తానికి అయితే ప్రభుత్వం పై వ్యతిరేకత ఉంటుందని సర్వే చేపట్టిన జగన్మోహన్ రెడ్డికి ఇది షాకింగ్ పరిణామమే.