మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. ఇస్లాంపూర్ గ్రామంలో ఓ వ్యక్తిని అతడి భార్య, కుమారుడు కలిసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. హత్య అనంతరం నిందితులిద్దరూ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.
ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన కొండపురం శ్రీరాములు (50) బోర్‌వెల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబపరమైన విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది.
ఈ సమయంలో భార్య, కుమారుడు కలిసి శ్రీరాములుపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ముందుగా ఆయన కళ్లలో కారం చల్లి.. అనంతరం తీవ్రంగా దాడి చేయడంతో శ్రీరాములు మృతి చెందినట్లు సమాచారం. ఘటన అనంతరం తల్లీకొడుకులు అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా కుటుంబ కలహాలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నప్పటికీ.. దర్యాప్తు పూర్తయిన తర్వాత అసలు కారణాలు, ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ ఘటనతో ఇస్లాంపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సమస్యలు చివరకు హత్యకు దారితీయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
also read: తమిళనాడు సర్కార్ భోజన పథకంపై ప్రత్యేక శ్రద్ద…! బడి పిల్లలకు చికెన్ బిర్యాణి
