Homeవైరల్బేగంబజార్ గణేశ్ విగ్రహంపై వైరల్ ప్రచారం.. అసలు నిజం ఇదే!

బేగంబజార్ గణేశ్ విగ్రహంపై వైరల్ ప్రచారం.. అసలు నిజం ఇదే!

బేగంబజార్ ఫీల్‌ఖానాలో ప్రతిష్ఠించిన ‘లీ చీ కా రాజా గణేశ్–2026’ విగ్రహంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారానికి పోలీసులు చెక్ పెట్టారు. విగ్రహాన్ని 48 కిలోల పంచలోహాలతో తయారు చేసి, 24 క్యారెట్ల బంగారు పూతతో పాటు 3.8 లక్షల అమెరికన్ డైమండ్లతో అలంకరించారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని గోషామహల్ పోలీసులు స్పష్టం చేశారు.

గణేశ్ నవరాత్రుల సందర్భంగా ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. విగ్రహం విలువ దాదాపు రూ.4 కోట్ల వరకు ఉంటుందని కూడా కొన్ని ప్రచారాల్లో పేర్కొనడంతో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది.

ఈ ప్రచారంపై గోషామహల్ పోలీసులు విచారణ చేపట్టగా.. సోషల్ మీడియాలో చెబుతున్న విధంగా విగ్రహాన్ని బంగారం, వజ్రాలతో తయారు చేయలేదని నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గోషామహల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి. శ్రావణ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘లీ చీ పెర్ల్స్ అండ్ జ్యువెల్స్’ అనే వ్యాపార సంస్థకు ప్రచారం కల్పించుకునే ఉద్దేశంతోనే ఈ తరహా సమాచారం ప్రచారంలోకి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.

మరోవైపు ఈ ఆరోపణలపై వ్యాపార సంస్థ యజమాని ఆదర్ అగర్వాల్ స్పందించారు. తాము ఎలాంటి అతిశయోక్తి ప్రకటనలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. వైరల్ అవుతున్న ప్రచారం కారణంగా తమ కుటుంబానికి భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రజలు సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వార్తను నిజమని నమ్మకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు. ధ్రువీకరణ లేని ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లను ఇతరులకు ఫార్వర్డ్ చేయడం ద్వారా అనవసర గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. గణేశ్ ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారికంగా ధ్రువీకరించిన సమాచారాన్నే విశ్వసించాలని కోరారు.

also read: కుమారుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఆపై పోలీస్ స్టేషన్‌లో లొంగుబాటు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు