తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ కైలాష్ చంద్ మంగ్లాను హైదరాబాద్‌కు చెందిన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల కింద ఆయనను అదుపులోకి తీసుకున్న అనంతరం విశాఖపట్నంలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం కైలాష్ చంద్‌కు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందన్న ఆరోపణలపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. దర్యాప్తులో భాగంగా పామాయిల్, పామోలిన్‌తో పాటు ఇతర పదార్థాలు, రసాయనాలను ఉపయోగించి నకిలీ నెయ్యి తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఉత్పత్తిని ‘అగ్‌మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి’గా చూపిస్తూ టీటీడీకి సరఫరా చేసినట్లు ఈడీ పేర్కొంది.
2019 నుంచి 2024 మధ్య సుమారు రూ.230 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలినట్టు అధికారులు తెలిపారు. ఇందులో దాదాపు రూ.96 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని కైలాష్ చంద్ మంగ్లాకు చెందిన ఫ్యాక్టరీలోనే తయారు చేసినట్లు ఈడీ గుర్తించింది.
ఈ వ్యవహారంలో కైలాష్ చంద్ సహ కుట్రదారుడిగా వ్యవహరించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్, మల్‌గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ తదితర సంస్థల పేర్లతో నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. అసలైన ఆవు నెయ్యిని తయారు చేసినట్లు చూపించేందుకు తప్పుడు రికార్డులు సృష్టించినట్లు కూడా ఈడీ ఆరోపించింది.
ఇదే కేసులో ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్న విపిన్ జైన్‌ను ఈడీ అధికారులు గతంలోనే అరెస్ట్ చేశారు. తాజాగా కైలాష్ చంద్ మంగ్లా అరెస్ట్‌తో టీటీడీ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు మరింత కీలక దశకు చేరినట్లు తెలుస్తోంది.
also read: ‘మగవాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండు’.. శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
