-
జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్
-
జూలైలో వైసీపీలో చేరే అవకాశం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైసీపీలోకి విజయసాయిరెడ్డి రీఎంట్రీ ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి రాయబారం పంపారా? పాత సంగతులు మరిచి పార్టీలోకి రావాలని ఆహ్వానించారా? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే ఆసక్తికర చర్చ. మద్యం కుంభకోణం కేసులో ఇటీవల ఈడి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. విజయసాయి రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు జరిపింది. ఆ సమయంలో నేరుగా సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి. పైగా మీడియాలో ఎంట్రీ తో పాటు రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అయితే అది ఎమోషనల్ బ్లాక్మెయిల్ లో భాగం అని ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డిని వైసీపీలోకి రప్పించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
జగన్ తో సుదీర్ఘ ప్రయాణం..
వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట సుదీర్ఘకాలం ప్రయాణం చేశారు విజయసాయిరెడ్డి. వైయస్ కుటుంబ ఆడిటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి.. జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా మారారు. అలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో కూడా కీలక భూమిక పోషించారు. ఆ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు జగన్మోహన్ రెడ్డికి మించి కృషి చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు విజయసాయిరెడ్డికి. అయితే మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.
పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని భావించి విజయసాయిరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. ఇకనుంచి వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి మనసు మార్చుకున్నారు. తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని చెప్పారు. కూటమి పార్టీలో ఛాన్స్ లేకపోవడంతో సొంతంగానే పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. మరోవైపు మీడియాలో ప్రవేశించి మూడు భాషల్లో చానల్స్ ను పెట్టేందుకు అన్ని సన్నాహాలు ప్రారంభించారు.
ప్రత్యేక పిలుపు..
అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయసాయి రెడ్డికి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీకి విజయసాయి రెడ్డి లాంటి దూకుడు కలిగిన నేతలేరు. గతంలో వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా దూకుడుగా ఉండేవారు విజయసాయిరెడ్డి. పార్టీ అనుబంధ విభాగాలను, సోషల్ మీడియా వింగ్ కు నాయకత్వం వహించేవారు. ఈ క్రమంలో పార్టీలో నెంబర్ 2 గా ఎదిగారు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు ఆయనకు సలహా ఇచ్చినట్లు సమాచారం.
విజయసాయిరెడ్డి ని పార్టీ లోకి రప్పించి కీలక బాధ్యతలు కట్టబెడితే పార్టీకి మైలేజ్ వస్తుందని సూచనలు చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటికే విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవిని వదులుకున్నారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన వివరాలను ప్రత్యేక దర్యాప్తు బృందానికి అందించారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉన్నారు. కానీ సన్నిహితులు మాత్రం విజయసాయిరెడ్డి పార్టీలోకి రప్పించుకోవడమే మేలని సలహా ఇస్తున్నారట. మరోవైపు విజయసాయిరెడ్డి సైతం తన రాజకీయ పున ప్రవేశం జూలైలో ఉంటుందని చెప్పుకొచ్చారు. తద్వారా ఆయన జూలైలో వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.