క్రైమ్ మిర్రర్ : జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డుపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవి శ్రీ గార్డెన్ సమీపంలోని మలుపు వద్ద వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జగిత్యాలకు చెందిన కాశీపాక గంగాధర్ (22) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో గంగాధర్‌తో పాటు ఆయన తాత పోచయ్య కూడా బైక్‌పై ప్రయాణిస్తున్నారు. బైక్ డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గంగాధర్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. పోచయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోచయ్యను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుడు గంగాధర్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
also read : ఇద్దరు భర్తల మోసం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నానన్న నటి
