బాలీవుడ్ నటి శ్వేతా తివారీ మరోసారి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆమె ‘ది ట్రెయిటర్స్ సీజన్ 2’లో పాల్గొంటున్నారు. ఈ షోకు సంబంధించిన తాజా ప్రోమోలో శ్వేతా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
షోలో భాగంగా అబద్ధాలు చెప్పే వ్యక్తులను గుర్తించడం గురించి హోస్ట్ కరణ్ జోహర్ శ్వేతాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘అబద్ధాలు చెప్పేవారిని నువ్వు గుర్తించలేవు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అందుకు శ్వేతా స్పందిస్తూ.. తన మాజీ భర్తలు ఇద్దరూ తనను మోసం చేస్తున్న సమయంలో తానే వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నానని చెప్పినట్లు ప్రోమోలో కనిపించింది.
రెండు వివాహాలు.. రెండూ విడాకులతో ముగింపు
శ్వేతా తివారీ వ్యక్తిగత జీవితం గతంలోనూ పలుమార్లు వార్తల్లో నిలిచింది. ఆమె 1998లో నటుడు రాజా చౌదరీని వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత వీరిద్దరూ విడిపోయారు.
ఆ తర్వాత 2013లో అభినవ్ కోహ్లీని శ్వేతా పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ వివాహ బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలోనే తన మాజీ భర్తల గురించి శ్వేతా చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
కూతురు కూడా హీరోయిన్‌గా గుర్తింపు
శ్వేతా తివారీ కూతురు పాలక్ తివారీ కూడా సినీ రంగంలోకి అడుగుపెట్టి నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సినిమాలు చేస్తున్నారు. దీంతో తల్లి, కూతురు ఇద్దరూ సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారు.
ప్రస్తుతం ‘ది ట్రెయిటర్స్ సీజన్ 2’లో శ్వేతా తివారీ పాల్గొనడం, షోలో ఆమె వ్యక్తిగత అనుభవాలపై చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా తన మాజీ భర్తల విషయంలో తానే మోసాన్ని గుర్తించానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
also read: అరుణాచల్‌పై ఆందోళన.. ‘చైనా ఆక్రమణలు పెరుగుతున్నాయి’ అంటూ యువకుడి వీడియో వైరల్
