-
నమ్మకస్తులతో కోర్ కమిటీని ఏర్పాటు చేసిన విజయ్
-
హంగ్ వస్తే టీవీకే పార్టీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు
-
ముందుగానే పసిగట్టిన దళపతి
క్రైమ్ మిర్రర్, ఎలక్షన్ డెస్క్: తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఫలితాల ప్రకటనకు మరికొద్ది గంటలే వ్యవధి ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు అంచనాల్లో తలమునకలై ఉన్నాయి. కచ్చితంగా హాంగ్ వచ్చేలా ఉంది. సర్వే సంస్థలన్నీ దీనినే చెబుతున్నాయి. ఒకవేళ హంగ్ ఏర్పడితే విజయ్ పార్టీ పాత్ర ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. రాష్ట్రంలో ఏ కూటమికి కూడా 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్ రాకుంటే విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారనుంది. విజయ్ మొదటి నుంచి తన ప్రచారంలో అధికారంలో వాటా అనే నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. తద్వారా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన పట్టుబట్టే అవకాశం ఉంది. అయితే అన్నింటికీ మించి తమిళనాడు రాజకీయాలను అధిగమించడం.. తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం విజయ్ ముందున్న అతిపెద్ద సవాల్.
డీఎంకే నుంచి నో ఛాన్స్
అయితే మెజారిటీ సర్వేలు డీఎంకేకు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఒకవేళ హంగ్ వస్తే.. డీఎంకే అతిపెద్ద పార్టీగా అవతరిస్తే.. సీఎం పదవి వదులుకునేందుకు స్టాలిన్ ఇష్టపడరు. అందుకే డీఎంకే వైపు వెళ్లకుండా.. తన డిమాండ్లను తలొగ్గే కూటమి వైపు విజయ్ మొగ్గు చూపవచ్చు. డీఎంకేను అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా బిజెపి- అన్నా డీఎంకే కూటమి ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. డీఎంకే మెజారిటీకి స్వల్ప దూరంలో నిలబడి పోతే మాత్రం ఆ పార్టీని అడ్డుకునేందుకు ఎంత దాకైనా అన్న డీఎంకే ముందుకెళ్తుంది. విజయ్ కు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసి.. బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు కూడా సిద్ధపడనుంది. కేవలం డిఎంకె అధికారంలోకి రాకుండా ఉండేందుకు చెక్ పెట్టాలి అనేది అన్న డీఎంకే ఆలోచన. పైగా ఐదేళ్లపాటు విజయ్ ఇమేజ్ను ఉపయోగించుకొని కూటమిని మరింత అభివృద్ధి చేయాలని చూస్తుంది బిజెపి.
అంగీకరిస్తారా? లేదా..
బిజెపి నేతృత్వంలోని అన్నాడీఎంకే నుంచి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ వస్తే విజయ్ అంగీకరిస్తారా? అనేది కూడా ఒక అనుమానం. ఎన్నికలకు ముందు పొత్తు కుదుర్చుకోవాలని చూసింది విజయ్ తో బిజెపి. చాలా రకాలుగా ఒత్తిళ్లు చేసింది కానీ కుదరలేదు. ద్రవిడ సిద్ధాంత భావజాలం నుంచి బయటకు వెళ్తే తన పార్టీకి భవిష్యత్తు ఉండదని విజయ్ భావించారు. అయితే ఇప్పుడు స్నేహ హస్తం అందించేందుకు బిజెపి ముందుకు వస్తే విజయ్ అంగీకరిస్తారా లేదా అనేది కూడా అనుమానమే. కానీ డిఎంకెను చెక్ పెట్టాలంటే అన్న డిఎంకెతో చేతులు కలపాల్సిన అనివార్య పరిస్థితి విజయ్ ది.
ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు..
ప్రస్తుతం హంగ్ వస్తే విజయ్ ముందు ఉన్న కర్తవ్యం ఎమ్మెల్యేలను కాపాడుకోవడం. అది అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే అన్నా డిఎంకె కూటమికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మద్దతు ఉంది. మరోవైపు తమిళనాడులో అధికార పార్టీగా డీఎంకే ఉంది. ఆ రెండు పార్టీల మధ్య తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఇప్పుడు విజయ్ ముందు ఉన్న కర్తవ్యం. ప్రధానంగా డీఎంకే ఊరికే కూర్చోదు. తప్పకుండా విజయ్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతుంది. ఒక నటుడి కింద పనిచేయడం కంటే.. బలమైన పునాది ఉన్న డీఎంకే లో చేరడం మేలు అని విజయ్ ఎమ్మెల్యేలను ఆకర్షించే అవకాశం ఉంది. విజయ్ పార్టీ నుంచి గెలిచే ఛాన్స్ ఉన్న నేతలతో డీఎంకే ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అందుకే కింగ్ మేకర్ కావాలనుకుంటున్న విజయ్ ముందుగానే జాగ్రత్తపడుతున్నారు. తనకు అత్యంత నమ్మకస్తులతో ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల భద్రతపై కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ భారీ అంచనాలకు మే 4న బ్రేక్ పడనుంది.