ద్రాక్ష పండ్లను పండ్ల రాణిగా పిలుస్తారు. తీపి, స్వల్ప పులుపు రుచితో అందరినీ ఆకట్టుకునే ఈ పండ్లు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. పచ్చ, ఎరుపు, నీలం, ఊదా, నలుపు వంటి రంగుల్లో లభించే ద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర కణాలను రక్షించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
గుండె ఆరోగ్యానికి మేలు
ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రోల్ అనే శక్తివంతమైన పాలీఫినాల్ రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో, రక్తప్రసరణను సులభతరం చేయడంలో సహాయపడుతుంది. అలాగే రక్తపోటు నియంత్రణకు, గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ద్రాక్షలోని పొటాషియం శరీరంలోని అదనపు సోడియం ప్రభావాన్ని తగ్గించి గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.
యాంటీఆక్సిడెంట్ల పవర్
ద్రాక్ష తొక్క, గింజల్లో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో, కణాల రక్షణలో, కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో పాత్ర పోషించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కంటి, మెదడు ఆరోగ్యానికి
కొన్ని అధ్యయనాల ప్రకారం ద్రాక్షలోని పోషకాలు కంటి రెటీనాను రక్షించడంలో, చూపు ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడవచ్చు. అలాగే రెస్వెరాట్రోల్ మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరచి జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యానికి మద్దతు ఇవ్వొచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అల్జీమర్స్ వంటి వ్యాధులపై కూడా దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి.
కీళ్ల నొప్పులు, చర్మానికి కూడా మేలు
ద్రాక్షలోని పాలీఫినాల్స్ శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో ఆస్టియోఆర్థ్రైటిస్ వంటి సమస్యల్లో కీళ్ల కదలికలకు కొంత మద్దతు లభించవచ్చు. అలాగే రెస్వెరాట్రోల్ చర్మ కణాలను రక్షించి వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా కనిపించేందుకు తోడ్పడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
రోజుకు ఎంత తినాలి?
ద్రాక్షలో సహజ చక్కెర కూడా ఉంటుంది. అందువల్ల మితంగా తీసుకోవడం మంచిది. సాధారణంగా రోజుకు రెండు నుంచి మూడు కప్పుల వరకు ద్రాక్ష తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఒక కప్పులో సుమారు 15–20 ద్రాక్ష పండ్లు ఉంటాయి. మధుమేహం ఉన్నవారు లేదా ప్రత్యేక ఆహార నియమాలు పాటిస్తున్నవారు మాత్రం వైద్యుడు లేదా పోషకాహార నిపుణుల సలహా మేరకు పరిమాణాన్ని నిర్ణయించుకోవడం మంచిది.
గమనిక:- ఈ కథనం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేసేముందు వైద్యుడు లేదా పోషకాహార నిపుణులను సంప్రదించండి.
