Homeక్రైమ్ఐఐటీ బాంబేలో విషాదం.. పరీక్షలో మొబైల్‌తో పట్టుబడ్డ విద్యార్థి ఆత్మహత్య

ఐఐటీ బాంబేలో విషాదం.. పరీక్షలో మొబైల్‌తో పట్టుబడ్డ విద్యార్థి ఆత్మహత్య

ఐఐటీ బాంబే పవయీ క్యాంపస్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పరీక్ష సమయంలో మొబైల్‌ ఫోన్‌ ఉపయోగిస్తూ ఇన్విజిలేటర్లకు పట్టుబడ్డ 19 ఏళ్ల విద్యార్థి హాస్టల్‌ గదిలో మృతిచెందడం కలకలం రేపింది. మృతుడిని ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్న సాహిల్‌గా గుర్తించారు.

ఇటీవల నిర్వహించిన ఓ పరీక్షలో సాహిల్‌ మొబైల్‌ ఫోన్‌ వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ప్రశ్నపత్రాన్ని చాట్‌జీపీటీకి అప్‌లోడ్‌ చేస్తున్న సమయంలో ఇన్విజిలేటర్లకు పట్టుబడినట్లు సమాచారం.

ఈ ఘటనపై సాహిల్‌పై ఎలాంటి కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని ఐఐటీ బాంబే అధికారులు తెలిపారు. విభాగాధిపతి అతడిని పిలిచి మందలించడంతో పాటు కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే, ఆ తర్వాత సాహిల్‌ తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది.

శుక్రవారం రాత్రి సాహిల్‌ తన హాస్టల్‌ గదిలో మృతిచెందాడు. ఈ ఘటనతో క్యాంపస్‌లో విషాద వాతావరణం నెలకొంది. ఇదే ఏడాది ఐఐటీ బాంబేలో చోటుచేసుకున్న నాలుగో మరణం కావడంతో విద్యార్థుల్లో ఆందోళన మరింత పెరిగింది.

వరుస ఘటనలపై విద్యార్థులు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ శుక్రవారం రాత్రి క్యాంపస్‌లో నిరసన చేపట్టారు. విద్యార్థుల భద్రత, సంక్షేమంపై యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితుల నేపథ్యంలో క్యాంపస్‌లో పోలీసులు భద్రతను పెంచారు.

విద్యార్థి మరణంపై ఐఐటీ బాంబే యాజమాన్యం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబ సభ్యులు, స్నేహితులకు సానుభూతి తెలిపింది. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులతో కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.

also read: టపాసులు కాలుస్తూ రీల్.. దుకాణంలోకి దూసుకెళ్లిన మంటలు.. వ్యక్తి మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు