హరియాణాలోని సోనిపట్‌లో ఆరు నెలల చిన్నారిపై పిట్‌బుల్ కుక్క దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిలో పసిపాపకు తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ఓ మహిళ తన ఆరు నెలల పాపను ఎత్తుకుని ఇంటి బయట నిల్చున్న సమయంలో అకస్మాత్తుగా పిట్‌బుల్ కుక్క వారివైపు దూసుకొచ్చింది. ఊహించని దాడితో భయపడిన తల్లి కిందపడిపోయింది. అదే సమయంలో కుక్క చిన్నారిని నోట కరుచుకుని ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించింది.
కుక్కను విడిపించేందుకు తల్లి, చుట్టుపక్కల వారు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అది పాపను వదల్లేదు. దీంతో స్థానికులు కర్రలతో కుక్కను కొట్టడంతో చివరకు దాని పట్టు సడలింది. వెంటనే చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ దాడిలో పాప తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వైద్యులు చిన్నారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన నేపథ్యంలో పెంపుడు కుక్కల విషయంలో యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
also read: ఐఐటీ బాంబేలో విషాదం.. పరీక్షలో మొబైల్‌తో పట్టుబడ్డ విద్యార్థి ఆత్మహత్య
