క్రైమ్ మిర్రర్ : బస్సులో రద్దీగా ఉందనే కారణంతో ఒక విద్యార్థిపై ఆర్టీసీ డ్రైవర్ అసభ్యకర పదజాలంతో విరుచుకుపడటమే కాకుండా, ప్రాణాలు తీస్తానంటూ బెదిరింపులకు దిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామానికి చెందిన వీరవెల్లి భార్గవ్ local మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. గత సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత స్వగ్రామానికి వెళ్లేందుకు తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అయితే, బస్సులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో నిలబడటానికి సరిగా చోటు లేక డ్రైవర్ క్యాబిన్ పక్కన నిలబడ్డాడు.
రౌడీయిజం చేసిన డ్రైవర్:
నెల్లికుదురు వ్యవసాయ మార్కెట్ ప్రాంతానికి బస్సు చేరుకోగానే కొంతమంది ప్రయాణికులు కిందకు దిగుతున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ స్వామి సదరు విద్యార్థిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. లోపలికి వెళ్లాలంటూ అసభ్యంగా దూషించడమే కాకుండా, బస్సు టైర్ల కింద తొక్కించి చంపేస్తానంటూ తీవ్రంగా బెదిరించాడు. అంతటితో ఆగకుండా భార్గవ్ చొక్కా కాలర్ పట్టుకుని బలవంతంగా వెనక్కి నెట్టివేశాడు.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు:
డ్రైవర్ ప్రవర్తనతో తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థి, ఇంటికి చేరుకున్న వెంటనే జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించాడు. డ్రైవర్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు.. ఇవాళ విద్యార్థితో కలిసి నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డ్రైవర్ స్వామిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. విద్యార్థి పట్ల బాధ్యతారాహిత్యంగా, రౌడీలా ప్రవర్తించిన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
also read : ఘోర రోడ్డు ప్రమాదం: మురుగు కాలువలో పడిన కారు.. ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి
