Homeతెలంగాణతెలంగాణలో ఇంధన కొరత ఉందా..? మంత్రి ఉత్తమ్ ఏం చెప్పారంటే

తెలంగాణలో ఇంధన కొరత ఉందా..? మంత్రి ఉత్తమ్ ఏం చెప్పారంటే

తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ నిల్వలకు సంబంధించి సామాన్య ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంధన కొరత ఏర్పడుతుందనే వదంతులను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని వివరించారు. చమురు కంపెనీలతో ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. సరఫరాలో ఎక్కడా ఆటంకాలు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ రైతులకు డీజిల్ ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

ఇంధన సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. పెట్రోల్ లేదా డీజిల్ సరఫరాలో ఇబ్బందులు ఎదురైనా.. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా ప్రజలు వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 1967 అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ల ఆధ్వర్యంలో మానిటరింగ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు జిల్లాలోని పెట్రోల్ బంకుల వద్ద నిల్వలను అలాగే సరఫరా తీరును నిరంతరం పర్యవేక్షిస్తాయి.

పెట్రోల్, డీజీల్ అక్రమ రవాణాను అరికట్టేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో గట్టి నిఘా ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను చూసి ప్రజలు ఆందోళనతో బంకుల వద్ద క్యూలు కట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంధన సరఫరాపై సర్కార్ పూర్తి పట్టుతో ఉంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసానిచ్చారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ALSO READ: We will fight for farmer issues…KTR : రైతు స‌మ‌స్య‌ల‌పై పోరాటాలు చేస్తాం…కేటీఆర్…!

తాజావార్తలు