Homeతెలంగాణకెసిఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్ర..పూర్వ వైభవానికి గులాబీ పార్టీ తహతహ!!

కెసిఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్ర..పూర్వ వైభవానికి గులాబీ పార్టీ తహతహ!!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : గులాబీ బాస్ కెసిఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రానున్నారా? త్వరలో బస్సు యాత్ర చేపడతారా? అందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ సిద్ధం అవుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో పూర్వ వైభవం సాధించాలని గులాబీ పార్టీ తహతహలాడుతోంది. అందుకే సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగాలని నిర్ణయించింది. ఒకవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర, మరోవైపు అధినేత కెసిఆర్ బస్సు యాత్ర ఏకకాలంలో సాగాలన్న నిర్ణయానికి గులాబీ పార్టీ హై కమాండ్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కేటీఆర్ కంటే ముందే కేసీఆర్ బస్సు యాత్రతో బయలుదేరుతారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజాక్షేత్రంలో బలంగా నిలబెట్టేందుకు కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగుతారని కేటీఆర్ ప్రకటించారు. ఈ బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్ను కెసిఆర్ స్వయంగా నిర్ణయిస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.

మారుతున్న పొలిటికల్ సీన్..

తెలంగాణలో పొలిటికల్ సీన్ మారుతోంది. ఒకవైపు బిజెపి దూకుడు పెంచుతోంది. ఇంకో వైపు కవిత సౌండ్ చేస్తున్నారు. ఈ సమయంలో రాజకీయంగా యాక్టివ్ కాకుంటే పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లడం ఖాయమని కెసిఆర్, కేటీఆర్ భావిస్తున్నారు. అయితే ఒకవైపు కేటీఆర్ పాదయాత్ర జరుపుతూనే.. దానికి సమాంతరంగా కేసీఆర్ బస్సు యాత్రతో రంగంలోకి దిగితే తెలంగాణలో పూర్వవైభవం సాధించవచ్చు అని సీనియర్లు భావిస్తున్నారు. ఈ ఇద్దరి భారీ యాత్రల ద్వారా రాష్ట్రంలోని ప్రతి పల్లెను, ప్రతి ఓటర్ను పలకరించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో అనుసరిస్తున్న వైఖరి ప్రజల్లోకి తీసుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయని గులాబీ పార్టీ భావిస్తోంది. మరోవైపు గతం మాదిరిగా ఒంటరిగానే పోటీ చేసి తెలంగాణలో అధికారం చేపడతామని కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు కేటీఆర్. ఆ లక్ష్యం దిశగా అడుగులు వేసే క్రమంలో ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మారిన రేవంత్ వ్యూహంతో..

ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం మార్చారు. గులాబీ పార్టీని కాదని కమలం పార్టీపై ఆయన దృష్టి పెట్టారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. దీంతో తెలంగాణలో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బిజెపి అన్నట్టు ఉందని సంకేతాలు పంపారు. ఇటువంటి సమయంలో పార్టీ పరంగా యాక్టివ్ గా ఉండకుంటే అసలుకే ఎసరు వస్తుందని గులాబీ పార్టీ భావించింది. అందుకే బస్సు యాత్ర, పాదయాత్ర కార్యాచరణను మొదలుపెట్టింది. ఈ సరికొత్త స్ట్రాటజీ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా సరికొత్త పొలిటికల్ వేడి పుట్టించడానికి సిద్ధమవుతోంది. అధికారపక్షంపై ప్రజావ్యతిరేకతను అనుకూలంగా మార్చుకొని. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ఈ యాత్రలు ఎంతగానో దోహదపడతాయని భావిస్తోంది. కానీ కెసిఆర్ విషయంలో ఇలాంటి ప్రకటనలు ఎన్నోసార్లు వచ్చాయి. తరువాత బుట్ట దాఖలు అయ్యాయి. మరి ఈసారైనా కేటీఆర్ ప్రకటన కార్యరూపం దాల్చుతుందా? లేదా? అన్నది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు