క్రైమ్ మిర్రర్ : గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఐ నాగరాజు కస్టడీ విచారణకు సంబంధించి గతంలో హైకోర్టు విధించిన నిబంధనలను సుప్రీంకోర్టు సవరించింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగించేందుకు మార్గం సుగమమైంది.
ఈ కేసులో విచారణ విధానానికి సంబంధించిన అంశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, కస్టడీ విచారణపై హైకోర్టు విధించిన పరిమితులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో సిట్ దర్యాప్తును కొనసాగించేందుకు అనుమతి ఇవ్వడంతో దర్యాప్తు ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశం ఏర్పడింది.
సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో సిట్ అధికారులు మాజీ సీఐ నాగరాజును విజయవాడలోని కార్యాలయంలో ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన వివిధ అంశాలపై ఆయన నుంచి వివరాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది. గాదె సాయికృష్ణ మృతి కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ వ్యవహారంలో దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. సిట్ సేకరించే ఆధారాలు, వాంగ్మూలాల ఆధారంగా తదుపరి న్యాయపరమైన చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.
also read : జనసేన రాజంపేట సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ సూసైడ్
