క్రైం మిర్రర్ : పాతబస్తీలో సంచలనం సృష్టించిన 17 ఏళ్ల యువకుడు ఫైజ్ మహమ్మద్ అలియాస్ అజాన్ హత్య కేసును కలపత్తర్ పోలీసులు ఛేదించారు. ఘటన జరిగిన ఎనిమిది రోజుల్లోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, రక్తపు మరకలు ఉన్న దుస్తులు, యాక్టివా స్కూటర్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 19న తెల్లవారుజామున బిర్యానీషా టేక్రీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహమ్మద్ అబ్రార్, మహమ్మద్ ఇస్మాయిల్ అలియాస్ ఫర్హాన్, మహమ్మద్ అష్ఫాక్ అనే ముగ్గురు వ్యక్తులు అక్కడికి వెళ్లిన సమయంలో ఫైజ్ మహమ్మద్ వారిని ప్రశ్నించడంతో వాగ్వాదం జరిగినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన నిందితులు యువకుడిపై పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో వ్యక్తి కూడా దాడిలో పాల్గొన్నట్లు తెలిపారు. తీవ్ర గాయాల కారణంగా ఫైజ్ మహమ్మద్ అక్కడికక్కడే మృతి చెందగా, నిందితులు స్కూటర్‌పై అక్కడి నుంచి పరారయ్యారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ప్రత్యక్ష సాక్షుల వివరాలు, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించి నిందితుల కదలికలను గుర్తించారు. విశ్వసనీయ సమాచారంతో జూలై 27న చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరానికి సంబంధించిన వివరాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నిందితులపై గతంలోనూ పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కలపత్తర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మొహమ్మద్ ఖలీల్ పాషా పర్యవేక్షణలో ఎస్‌ఐ బి. శివకుమార్ రెడ్డి, సిబ్బంది సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి కేసును ఛేదించారు. నిందితుల అరెస్టుపై ఉన్నతాధికారులు పోలీసు బృందాన్ని అభినందించారు. ఫలక్‌నుమా డివిజన్ ఏసీపీ ఎం.ఏ. జావీద్ మాట్లాడుతూ.. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రాధాన్యత ఇస్తున్నారని, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
also read : ‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం.. ఆందోళనలో అభిమానులు
