Homeఆంధ్ర ప్రదేశ్కేంద్ర క్యాబినెట్ లోకి జనసేన.. మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి ఛాన్స్!!!

కేంద్ర క్యాబినెట్ లోకి జనసేన.. మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి ఛాన్స్!!!

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయమా? ఆ పార్టీ ఎంపీ క్యాబినెట్ లో చేరుతారా? ఈ మేరకు కేంద్ర పెద్దలు అధినేత పవన్ కళ్యాణ్ కు విషయం చెప్పారా? పవన్ సైతం కీలక ప్రతిపాదన చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఎన్డీఏ పక్ష సమావేశానికి గాను పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ఈ మేరకు కేంద్ర పెద్దలు పవన్ కళ్యాణ్ కు మంత్రివర్గంలో చోటుకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రాతినిధ్యం లేదు..

కేంద్ర క్యాబినెట్లో జనసేనకు ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు. 2024 లో మూడోసారి మోదీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం నుంచి ముగ్గురు ఎంపీలకు క్యాబినెట్లో చోటు దక్కింది. టిడిపికి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బిజెపికి చెందిన భూపతి రాజు శ్రీనివాస వర్మ కు ఛాన్స్ దక్కింది. అయితే జనసేన నుంచి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, వల్లభనేని బాలసౌరీ గెలిచారు. అయితే అప్పట్లో వివిధ సమీకరణల నేపథ్యంలో జనసేనకు అవకాశం దక్కలేదు. అప్పట్లో కేంద్ర క్యాబినెట్లో చేరేందుకు పవన్ సైతం విముఖత చూపినట్లు వార్తలు వచ్చాయి.

రాజ్యసభ కేటాయింపు..

ఇటీవల కేంద్రంలో జనసేనకు ప్రాధాన్యం పెరుగుతోంది. తొలిసారిగా రాజ్యసభకు ఆ పార్టీకి ఛాన్స్ దక్కింది. ఏపీ నుంచి నలుగురు సభ్యులు పదవీ విరమణ చేస్తే.. అందులో మూడు స్థానాలను టిడిపి దక్కించుకుంది. ఒకటి జనసేన కు కేటాయించింది. ఆ పార్టీ నుంచి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్నిక లాంఛనమే. అయితే ఇప్పుడు జనసేనకు ముగ్గురు ఎంపీలు ఉన్నారు. అందులో ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు ఖాయమని తెలుస్తోంది.

కలిసి వస్తున్న సమీకరణలు..

అయితే కేంద్ర మంత్రివర్గంలో ప్రముఖంగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాల సౌరికి చోటు దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు. 2004లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి తెనాలి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. పార్లమెంట్లో అడుగు పెట్టారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2014లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. 2019లో మచిలీపట్నం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. మొన్నటి ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. పొత్తులో భాగంగా మచిలీపట్నం నుంచి పోటీ చేసి మరోసారి గెలిచారు బాలసౌరి. కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడం, సీనియర్ నేత కావడంతో కలిసి వచ్చే అంశం. ఆయనకు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయం అన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు