ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు కీలక శక్తిగా నిలిచిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్లీ తెలంగాణ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరిస్తోందా అనే చర్చ వేగంగా సాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన ఆ పార్టీ, తెలంగాణలో క్రమంగా తన రాజకీయ కార్యకలాపాలను తగ్గించుకుంది. అయితే గత కొంతకాలంగా మారుతున్న రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ విస్తరణపై జరుగుతున్న అంతర్గత చర్చల మధ్య టీటీడీపీకి మళ్లీ ఊపిరి పోసే ప్రయత్నాలు మొదలయ్యాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తాజాగా నిర్వహించిన మహానాడు వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేయడం రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మహానాడు వేదికగా మాట్లాడిన నారా లోకేశ్.. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తెలంగాణతో పాటు అండమాన్ ప్రాంతాల్లో కూడా పార్టీని విస్తరించే బాధ్యత తనపై ఉందని పేర్కొంటూ త్వరలో అక్కడి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తానని వెల్లడించారు. పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యమని, గత వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి అందరూ కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు కేవలం సాధారణ రాజకీయ ప్రకటనలా కాకుండా భవిష్యత్ కార్యాచరణకు సంకేతాలుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణలో టీడీపీ ప్రయాణాన్ని పరిశీలిస్తే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ 15 స్థానాలు గెలుచుకుని గణనీయమైన ప్రభావం చూపింది. అయితే తర్వాత రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2018 ఎన్నికల్లో మహాకూటమి భాగస్వామిగా కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌లతో కలిసి పోటీ చేసిన టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. అనంతరం పార్టీ ప్రభావం క్రమంగా తగ్గింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ప్రారంభ స్థాయిలో చర్చ జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై దృష్టి పెట్టడం, రాజకీయ లెక్కలు మార్చుకోవడం వల్ల చివరి దశలో తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. దీంతో తెలంగాణలో పార్టీ భవిష్యత్‌పై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.
అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ధైర్యం పెరగడం, జాతీయ స్థాయిలో సంబంధాల బలోపేతం, తెలంగాణలో పాత క్యాడర్‌ను మళ్లీ చైతన్యపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం మొదలైంది. ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లడం, అనంతరం మహానాడు వేదికగా నారా లోకేశ్ తెలంగాణ బాధ్యతలను ప్రస్తావించడం రాజకీయంగా కొత్త చర్చలకు కారణమయ్యాయి. ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే తెలంగాణలో టీడీపీ మళ్లీ క్రియాశీలక రాజకీయ పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈ వ్యూహానికి ప్రారంభ వేదిక కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ టీడీపీకి అనుకూల వర్గాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కొన్ని ప్రాంతాల్లో పార్టీ బీ ఫారాల కోసం నాయకులు ఆసక్తి చూపడం కూడా ఈ చర్చకు బలం చేకూర్చుతోంది. పార్టీ అధిష్టానం పూర్తిస్థాయిలో దృష్టి పెడితే క్షేత్రస్థాయి క్యాడర్ మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికార బాధ్యతలతో బిజీగా ఉన్న చంద్రబాబు నాయుడు అక్కడి రాజకీయాలను ముందుకు నడిపిస్తుండగా, తెలంగాణ బాధ్యతలను నారా లోకేశ్ చేపడితే పార్టీకి కొత్త దిశ లభించే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో కొత్త రాజకీయ స్థలం సృష్టించగలిగితే అది ప్రధాన పార్టీల ఓటు శాతాలపై ప్రభావం చూపే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం రాజకీయ చర్చల దశలోనే ఉన్నాయి. మహానాడు వేదికగా ప్రకటించిన సంకల్పం భవిష్యత్‌లో కార్యాచరణగా మారుతుందా లేదా అన్నది రాబోయే నెలల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.
ALSO READ: తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం.. ఏడుగురి అధికారులపై చర్యలకు రెడీ.!