తమిళనాడు రాజకీయాల్లో మునుపెన్నడూ చూడని విచిత్రమైన, అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా ఉండే ద్రవిడ దిగ్గజాలు డీఎంకే, అన్నాడీఎంకే తమ బద్ధ వైరాగ్యాన్ని పక్కన పెట్టడం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. తలపతి విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీని అధికార పీఠానికి దూరంగా ఉంచడమే పరమావధిగా ఈ రెండు పార్టీలు పొత్తు దిశగా అడుగులు వేస్తున్నాయి. ‘ఇండియా టుడే’ వెల్లడించిన ఈ కథనం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118 కాగా.. విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏకంగా 107 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఐదుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ విజయ్‌కు బేషరతు మద్దతు ప్రకటించడంతో ఆయన బలం 112కు చేరుకుంది. అయినప్పటికీ మెజారిటీకి ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు తక్కువగా ఉండటంతో అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విజయ్ తన బలాన్ని నిరూపించుకునే లోపే రంగంలోకి దిగిన పాత ప్రత్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయారు.
ప్రస్తుత సభలో 59 స్థానాలు గెలిచిన డీఎంకే.. 47 స్థానాలు గెలిచిన అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై మంతనాలు జరపడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. తమ ఉనికిని కాపాడుకోవడానికి సిద్ధాంతాలను పక్కనపెట్టి ఈ రెండు పార్టీలు ఒక్కటవ్వడం తమిళ రాజకీయాల్లో కొత్త శకానికి సంకేతంగా కనిపిస్తోంది. కొత్త శక్తిగా ఎదిగిన విజయ్‌ను అడ్డుకోవడానికి డీఎంకే, అన్నాడీఎంకే వేస్తున్న ఈ ఎత్తుగడలు ఫలించి సంకీర్ణ సర్కారు కొలువుదీరుతుందో లేక విజయ్ ఆరుగురు ఎమ్మెల్యేలను ఆకర్షించి గద్దెనెక్కుతారో చూడాలి.
ALSO READ: తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్.. అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే.. అసెంబ్లీ రద్దు చేసిన గవర్నర్!