Homeజాతీయంతమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్.. అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే.. అసెంబ్లీ రద్దు చేసిన గవర్నర్!

తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్.. అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే.. అసెంబ్లీ రద్దు చేసిన గవర్నర్!

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ 16వ శాసనసభను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 23వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో మే 5వ తేదీ నుండి ఈ రద్దు అమల్లోకి వస్తుందని రాజ్‌భవన్ ప్రకటించింది. మే 4న విడుదలైన ఫలితాల్లో ఏ రాజకీయ పక్షానికి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన స్పష్టమైన మెజారిటీ లభించలేదు. దీంతో రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడటంతో పాత సభను రద్దు చేసి కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు గవర్నర్ మార్గం సుగమం చేశారు.

విజయ్ ప్రభంజనం.. కుప్పకూలిన ద్రవిడ కోటలు

ఈ ఎన్నికల్లో కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అనూహ్య విజయాన్ని అందుకుంది. మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని శాసిస్తున్న అధికార డీఎంకే (DMK) కేవలం 59 సీట్లకే పరిమితం కాగా.. ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే (AIADMK) 47 స్థానాలతో సరిపెట్టుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి కేవలం 10 సీట్ల దూరంలో నిలిచిన విజయ్.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ప్రమాణస్వీకారం వాయిదా.. కొనసాగుతున్న ఉత్కంఠ

మెజారిటీ మార్కుకు చేరువలో ఉన్న టీవీకేకు ఐదు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బేషరతుగా మద్దతు ప్రకటించింది. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం ఇంకా పూర్తిస్థాయిలో సమకూరలేదు. గవర్నర్ నుంచి పిలుపు వచ్చినప్పటికీ సాంకేతిక కారణాలు.. బలం నిరూపించుకోవడంలో ఉన్న చిక్కుల వల్ల విజయ్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఫలితంగా రేపు జరగాల్సిన ప్రమాణస్వీకారోత్సవం తాత్కాలికంగా వాయిదా పడింది. స్వతంత్ర అభ్యర్థులు.. ఇతర చిన్న పార్టీల నేతలతో టీవీకే బృందం ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతోంది.

ఏఐఏడీఎంకేలో చీలిక? విజయ్ వైపు చూపు

రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీతో జట్టు కట్టడం ఇష్టం లేని ఏఐఏడీఎంకేలోని ఒక వర్గం నేతలు విజయ్ పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుమారు పదిమందికి పైగా ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే విజయ్ సునాయాసంగా మేజిక్ ఫిగర్‌ను దాటే అవకాశం ఉంటుంది. అటు అధికార కోల్పోయిన డీఎంకే సైతం వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయింది. మొత్తానికి తమిళనాట అధికారం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు.

ALSO READ: ఏపీలో టీవీకె.?! విజయ్ పార్టీ విస్తరణ…తెర వెనుక కాంగ్రెస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు