HomeజాతీయంBengal CM: మే 9న బెంగాల్ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం, బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌...

Bengal CM: మే 9న బెంగాల్ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం, బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌ లో భారీ ఏర్పాట్లు!

BJP Government in West Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పలువురు సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, తుది నిర్ణయం కోసం పార్టీ అగ్ర నాయకత్వం రాష్ట్ర నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది.

ఈ నెల 9న కొత్త సీఎం ప్రమాణం

ఈ నేపథ్యంలో మే 9వ తేదీ శనివారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నట్లు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య వెల్లడించారు. కోల్‌కతాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఉదయం 10 గంటలకు కోల్‌కతాలోని ప్రసిద్ధ బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌ లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇవాళ బీజేపీ శాసనసభా పక్ష సమావేశం

ఇవాళ(గురువారం) సాయంత్రం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త శాసనసభా పక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అదే నేత ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సమావేశానికి పార్టీ కీలక నాయకులు హాజరుకానున్నారు.

ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు పార్టీ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే కూటమి నాయకులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఈ వేడుకకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో కోల్‌కతాకు వచ్చే అవకాశముంది. దీనితో బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ జనసందోహం కనిపించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

24 మంది మంత్రులుగా ప్రమాణం

ఇక కొత్త మంత్రివర్గంలో దాదాపు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని తెలుస్తోంది. శాఖల కేటాయింపు, మంత్రుల ఎంపికపై కూడా పార్టీ నాయకత్వం చర్చలు కొనసాగిస్తోంది. మరోవైపు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు భద్రత, ట్రాఫిక్, వేదిక ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు