క్రైమ్ మిర్రర్ : ఊరేగింపు సందర్భంగా మోత మోగించిన డీజే సౌండ్ ఓ నవజాత శిశువు మృతికి కారణమైందనే అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ఇంటి ముందు డీజే వాహనం ఆగి భారీ శబ్దంతో పాటలు వినిపిస్తున్న సమయంలో తల్లి పక్కన నిద్రిస్తున్న 20 రోజుల పసికందు అస్వస్థతకు గురైంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రీమా దేవి 20 రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం ఆమె తన పుట్టింటికి చేరుకుని ముడియారి గ్రామంలో నివసిస్తోంది. ఈ క్రమంలో గ్రామంలో దేవతా విగ్రహ నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో భాగంగా డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వాహనం రీమా దేవి ఉంటున్న ఇంటి ముందు ఆగింది.
ఆ సమయంలో తల్లి పక్కన నిద్రిస్తున్న పసికందు భారీ డీజే శబ్దానికి ఉలిక్కిపడి గట్టిగా ఏడ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్దిసేపటికే శిశువు కదలకుండా ఉండటంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనపై చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో నవజాత శిశువు ఉందని, డీజే శబ్దాన్ని తగ్గించాలని, వాహనాన్ని అక్కడి నుంచి తరలించాలని పలుమార్లు నిర్వాహకులను కోరినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు.
పోలీసుల దర్యాప్తు.. పోస్టుమార్టం నివేదిక కీలకం
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే శిశువు మృతికి అసలు కారణాలు వెల్లడవుతాయని పోలీసు అధికారులు తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
also read : తల్లిపై కత్తితో దాడి.. ఆపై భవనంపై నుంచి దూకి బాలుడి ఆత్మహత్య
