HomeజాతీయంNishant Kumar: మంత్రిగా నితీష్ తనయుడు.. బీహార్ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం!

Nishant Kumar: మంత్రిగా నితీష్ తనయుడు.. బీహార్ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం!

Bihar Cabinet Expansion: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 7వ తేదీన రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగనుండగా, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే వేగంగా కొనసాగుతున్నాయి. పాట్నాలోని గాంధీ మైదానంలో భారీ స్థాయిలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మంత్రివర్గంలో నితీశ్ కుమార్ కుమారుడికి చోటు

తాజా మంత్రివర్గ విస్తరణలో మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్‌కు కూడా చోటు దక్కే అవకాశం ఉందనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇప్పటివరకు రాజకీయాలకు కొంత దూరంగా ఉన్న నిశాంత్, ప్రభుత్వంలో చేరేందుకు మొదట ఆసక్తి చూపలేదని సమాచారం. అయితే, జేడీయూ సీనియర్ నేతలు ఆయనతో ప్రత్యేకంగా చర్చించి, పార్టీకీ రాష్ట్రానికీ ఆయన సేవలు అవసరమని చెప్పి ఒప్పించినట్టు తెలుస్తోంది. తాజాగా జేడీయూ నేతలు నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌తో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు పాట్నాలోని నితీశ్ కుమార్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రుల తుది జాబితాపై చర్చించి ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.

బీహార్ లో నిశాంత్ ప్రజాయాత్ర

ఇటీవల నిశాంత్ కుమార్ ప్రజల మధ్యకు వెళ్లి ‘బిహార్ గుడ్‌విల్ యాత్ర’ పేరుతో పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు, నితీశ్ కుమార్ పాలనలో జరిగిన అభివృద్ధి పనులపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. గత మే నెలలో ఆయన అధికారికంగా జేడీయూలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా ఆయనకు సభ్యత్వం అందజేశారు.

మంత్రివర్గంలో 27 మందికి అవకాశం

ఇక మంత్రివర్గ విస్తరణలో మొత్తం 27 మందికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బీజేపీకి అత్యధికంగా 12 స్థానాలు దక్కనున్నాయి. జేడీయూ నుంచి 11 మందికి అవకాశం ఉండగా, ఎల్‌జేపీ (రామ్‌ విలాస్) నుంచి ఇద్దరికి చోటు దక్కనుంది. అలాగే హెచ్ఏఎం, ఆర్ఎల్ఎస్‌పీ పార్టీలకు ఒక్కో మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు