మైనర్లు సోషల్ మీడియా ఖాతాలు వినియోగించడంపై నిషేధం లేదా కఠిన నియంత్రణలు విధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేయాలని కోరుతూ ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖతో పాటు న్యాయ శాఖకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. మైనర్లకు సోషల్ మీడియా వినియోగం ద్వారా ఎదురవుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు.
భారత కాంట్రాక్ట్ చట్టం ప్రకారం మైనర్లు చట్టబద్ధమైన ఒప్పందాల్లోకి ప్రవేశించలేరని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది హెచ్.ఎస్. ఫూల్కా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాంటప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఖాతా తెరిచే సమయంలో వినియోగ నిబంధనలకు సంబంధించిన ఆన్‌లైన్ ఒప్పందాలను మైనర్లు ఎలా అంగీకరిస్తారనే అంశాన్ని ఆయన ప్రశ్నించారు.
అమెరికాలో 13 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయని ఫూల్కా ధర్మాసనానికి వివరించారు. దీనిపై స్పందించిన జస్టిస్ సూర్యకాంత్.. పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసం భారత్‌లో కూడా ఇలాంటి రక్షణ చర్యల అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ బాగ్చి కూడా మైనర్లను రక్షించేందుకు సోషల్ మీడియా వినియోగంపై సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థ, పటిష్ఠమైన రక్షణ చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.
మైనర్లు సోషల్ మీడియాను వినియోగించడం వల్ల ఆన్‌లైన్ గ్రూమింగ్, లైంగిక వేధింపులు, సైబర్ బుల్లీయింగ్, వ్యక్తిగత సమాచార దుర్వినియోగం వంటి సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల సోషల్ మీడియా సంస్థలు ఖాతాలు తెరిచే సమయంలో వయసును నిర్ధారించే బలమైన వ్యవస్థను అమలు చేసేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
అయితే పిల్లలు పూర్తిగా ఆన్‌లైన్ ప్రపంచానికి దూరం కావాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రుల పర్యవేక్షణలో నిర్వహించే ఖాతాల ద్వారా విద్యా సంబంధిత కంటెంట్‌ను వీక్షించేందుకు అవకాశం ఉండవచ్చని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమర్పించే సమాధానం కీలకంగా మారింది.
also read: విజయ్ మాల్యా కేసులో ఈడీ కీలక వాదనలు.. బకాయిలు చెల్లించినా క్రిమినల్ కేసులు రద్దు కావు!
