స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మరో ఆసక్తికరమైన కార్యక్రమంలో భాగస్వామిగా మారారు. సినిమాలతో పాటు యువతలోని ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్న ఆమె.. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత దక్షిణ కొరియా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ HYBE ఇండియాతో కలిసి పనిచేస్తున్నారు. BTS వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కే-పాప్ గ్రూప్‌లను పరిచయం చేసిన HYBE.. భారత్‌లో ప్రతిభావంతులను గుర్తించేందుకు ఆడిషన్స్ నిర్వహిస్తోంది.
భారతీయ యువతలో దాగి ఉన్న టాలెంట్‌ను వెలుగులోకి తీసుకురావడమే ఈ ఆడిషన్స్ ప్రధాన ఉద్దేశం. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి రష్మిక భాగస్వామిగా వ్యవహరిస్తూ.. తమ కలలను సాకారం చేసుకోవాలనుకునే యువతకు ప్రోత్సాహం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా రష్మిక తన కెరీర్ ప్రారంభ దశలను గుర్తుచేసుకున్నారు. జీవితంలో ముందుకు వెళ్లాలంటే మనపై మనకు నమ్మకం ఉండటంతో పాటు, కష్టపడి పనిచేయడం ఎంతో అవసరమని ఆమె చెప్పారు. అనుకోకుండా వచ్చే అవకాశాలను కూడా ధైర్యంగా స్వీకరించాలని సూచించారు.
భారత్‌లో HYBE వంటి అంతర్జాతీయ సంస్థ ప్రతిభా అన్వేషణకు ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని రష్మిక పేర్కొన్నారు. ముఖ్యంగా కళాకారులు, పెర్ఫార్మర్స్‌గా ఎదగాలని కలలు కంటున్న అమ్మాయిలకు ఇది మంచి అవకాశమని అన్నారు. తమలో ఉన్న ప్రతిభను నిరూపించుకునేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.
“కలలు కనడమే కాదు.. వాటికి ఒక అవకాశం ఇవ్వాలి” అనే సందేశంతో రష్మిక యువతలో ఉత్సాహాన్ని నింపారు. ప్రపంచవ్యాప్తంగా BTS, TXT, NewJeans, ILLIT వంటి ప్రముఖ కే-పాప్ గ్రూప్‌లతో HYBEకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు భారత్‌లోని టాలెంట్‌పై సంస్థ దృష్టి పెట్టడంతో ఈ ఆడిషన్స్‌పై ఆసక్తి నెలకొంది.
ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో కలిసి ‘కాక్‌టెయిల్ 2’లో కనిపించారు. ప్రస్తుతం ఆమె ‘రణబాలి’ సినిమాలో నటిస్తున్నారు. 1870ల కాలంలో దక్షిణ భారతదేశాన్ని తీవ్ర కరువు ప్రభావితం చేసిన నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. తన ప్రజలను, ప్రాంతాన్ని రక్షించుకునేందుకు ఓ తిరుగుబాటు యోధుడు బ్రిటిష్ కమిషనర్‌ను ఎలా ఎదుర్కొన్నాడనే అంశం చుట్టూ కథ సాగనున్నట్లు సమాచారం.
also read: రియల్ ఎస్టేట్ వ్యాపారి రాంరెడ్డి ఆత్మహత్య.. రూ.60 కోట్ల అప్పులే కారణమా?
