మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ‘జనరేషనల్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్’ పేరుతో ప్రత్యేక విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకలో రవితేజ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
తన సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు, అపజయాలు ఎదుర్కొన్నానని చెప్పిన రవితేజ.. ‘ఇరుముడి’ తనకు నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవాన్ని అందించిందని తెలిపారు. కేవలం బాక్సాఫీస్ రికార్డులు సాధించడం కంటే.. ప్రేక్షకుల మనసుల్లో నటుడిగా మంచి స్థానం సంపాదించుకోవడం ఎంతో గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు.
‘ఇరుముడి’ తనకు అలాంటి అనుభూతిని ఇచ్చిందని రవితేజ భావోద్వేగంగా చెప్పారు. ముఖ్యంగా సినిమా విజయంతో డిస్ట్రిబ్యూటర్లలో కనిపించిన ఆనందం తనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు.
ఈ సినిమా విజయానికి దర్శకుడు శివ నిర్వాణ చేసిన కృషి ప్రధాన కారణమని రవితేజ ప్రశంసించారు. సినిమా కోసం దర్శకుడు ఎంతో అంకితభావంతో పనిచేశారని, రాత్రింబవళ్లు షూటింగ్‌లో పాల్గొంటూ మొత్తం టీమ్‌ను ముందుకు నడిపించారని కొనియాడారు. తన కెరీర్‌లో ఇంత ఎక్కువగా నైట్ షూటింగ్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి అని రవితేజ చెప్పడం విశేషం.
అలాగే సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు ఎంతో బలంగా నిలిచిందని రవితేజ ప్రశంసించారు.
కాగా, ‘ఇరుముడి’ విజయోత్సవ కార్యక్రమానికి దర్శకులు అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు సానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర బృందాన్ని అభినందిస్తూ వారు తమ శుభాకాంక్షలు తెలిపారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ డివోషనల్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించారు. సాయికుమార్‌తో పాటు చిన్నారి నక్షత్ర కీలక పాత్రల్లో కనిపించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో సినిమా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది.
also read: ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు.. సరిగమ సంచలన ఆరోపణలు
