బంగ్లాదేశ్‌లో జైలులో ఉన్న హిందూ సన్యాసి, సమ్మిళిత సనాతని జాగరణ్ జోట్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్‌కు అధికారులు ఐదు గంటల పాటు పెరోల్ మంజూరు చేశారు. క్యాన్సర్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన తన తల్లి సంధ్యా రాణి ధర్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఈ అవకాశం కల్పించారు. తల్లి బతికున్న సమయంలో కుమారుడిని ఒక్కసారి చూడాలన్న ఆమె కోరిక నెరవేరకపోవడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచింది.
చిన్మయ్ కృష్ణ దాస్ 2024 నవంబర్‌లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయ్యారు. జాతీయ జెండాను అవమానించారనేది ఆయనపై నమోదైన కేసులో ప్రధాన ఆరోపణగా ఉంది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలకు సంబంధించి మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో చిన్మయ్ దాస్ తల్లి సంధ్యా రాణి ధర్ (71) గురువారం ఛటోగ్రామ్‌లోని హఠాజారి ఆశ్రమంలో మృతి చెందారు. కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తన కుమారుడిని చూడాలన్నది ఆమె చివరి కోరికగా కుటుంబ సభ్యులు తెలిపారు.
తల్లి అనారోగ్యంతో ఉన్న సమయంలో ఆమెను చూసేందుకు చిన్మయ్ దాస్‌కు పెరోల్ ఇవ్వాలని కుటుంబ సభ్యులు అధికారులను కోరారు. అయితే అనారోగ్యంతో ఉన్న బంధువును పరామర్శించేందుకు ఖైదీని విడుదల చేసే నిబంధన లేదంటూ అధికారులు ఆ అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో తల్లి చివరి రోజుల్లో కుమారుడిని చూడాలన్న ఆశ నెరవేరలేదు.
ఆమె మరణించిన అనంతరం ఛటోగ్రామ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ మహమ్మద్ జహిదుల్ ఇస్లాం మియా మానవతా దృక్పథంతో స్పందించారు. తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు చిన్మయ్ కృష్ణ దాస్‌కు ఐదు గంటల పెరోల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన చిన్మయ్ దాస్ పుండరీక్ ధామ్ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ రాధాకృష్ణ విగ్రహం పాదాలను తాకి ఆయన కన్నీటిపర్యంతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతరం తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
చిన్మయ్ కృష్ణ దాస్‌పై దేశద్రోహం కేసుతో పాటు, ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ప్రభుత్వ ప్రాసిక్యూటర్ మృతి చెందిన ఘటనకు సంబంధించి హత్య కేసు కూడా నమోదైనట్లు సమాచారం. కొన్ని కేసుల్లో బెయిల్ లభించినప్పటికీ, మరికొన్ని కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఆయన జైలులోనే కొనసాగుతున్నారు.
తల్లి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత పెరోల్ గడువు ముగియడంతో చిన్మయ్ కృష్ణ దాస్ తిరిగి ఛటోగ్రామ్ సెంట్రల్ జైలుకు వెళ్లారు. తల్లి చివరి కోరికను నెరవేర్చలేకపోయిన ఆయన.. కనీసం అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం పొందిన ఘటన బంగ్లాదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది.
also read: ఇరుముడి విజయంపై రవితేజ ఎమోషనల్.. నటుడిగా ఆ గౌరవం ఎంతో ప్రత్యేకమంటూ వ్యాఖ్యలు!
