పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన అక్రమ బొగ్గు తవ్వకాలు, నిధుల మళ్లింపు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఏఎంఆర్ గ్రూప్‌కు చెందిన కార్యాలయాలతో పాటు సంస్థకు సంబంధం ఉన్న కీలక వ్యక్తుల నివాసాల్లోనూ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, కోల్‌కతా, ఝార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగాయి. బొగ్గు గనుల మైనింగ్, వివిధ ప్రాజెక్టులు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, నిధుల మళ్లింపు తదితర అంశాలపై ఈడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలు కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
విచారణలో భాగంగా ఝార్ఖండ్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్-అసన్సోల్ ప్రాంతాలకు అక్రమంగా బొగ్గు తరలించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డెలివరీ ఆర్డర్ హోల్డర్లు, రవాణాదారుల నుంచి గుండా ట్యాక్స్, రంగదారి పన్ను పేరుతో బొగ్గు సిండికేట్ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తు సంస్థ గుర్తించింది. గత ఐదేళ్లలో ఈ అక్రమ వ్యవహారం ద్వారా రూ.650 కోట్లకు పైగా నేరపూరిత రాబడి సమకూరినట్లు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించినట్లు సమాచారం.
మరోవైపు పశ్చిమ బెంగాల్ అక్రమ కోల్ మైనింగ్ కేసులో ఈడీ ఇప్పటికే ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అరెస్టయిన చిన్మయ్ మోండల్, కిరణ్ ఖాన్‌తో పాటు మరో ముగ్గురిని కూడా నిందితులుగా పేర్కొంది. బొగ్గు అక్రమ రవాణా కొనసాగేందుకు కొందరు స్థానిక రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులకు భారీగా లంచాలు చెల్లించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఈడీ పేర్కొంది.
ప్రస్తుతం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో జరుగుతున్న తాజా సోదాలతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. తనిఖీల్లో లభించే పత్రాలు, ఆర్థిక ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది.
also read: తల్లి అంత్యక్రియల కోసం 5 గంటల పెరోల్.. కన్నీటిపర్యంతమైన చిన్మయ్ కృష్ణ దాస్
