ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఈ కేసు తీవ్రతను ప్రస్తావించిన సీజేఐ.. ఇది తీవ్రమైన ఆర్థిక నేరానికి సంబంధించిన వ్యవహారమని వ్యాఖ్యానించారు. కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది.
మరోవైపు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తుతో పాటు రాష్ట్ర పోలీసులు ఏర్పాటు చేసిన సిట్, సీఐడీ బృందాలు సమాంతరంగా దర్యాప్తు కొనసాగించడంలో ఎలాంటి తప్పు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వేర్వేరు దర్యాప్తు సంస్థలు తమ పరిధిలో విచారణ కొనసాగించవచ్చని పేర్కొంది.
ప్రస్తుతం నిందితులు ఈడీ కస్టడీలో ఉన్నట్లు వారి తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈడీ కస్టడీ ముగిసిన వెంటనే వారిని సిట్ కస్టడీకి తీసుకునేలా ప్రొడక్షన్ వారెంట్‌కు సంబంధించిన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. సిట్ దర్యాప్తు పూర్తయిన తర్వాత నిందితులు సంబంధిత కింది కోర్టును ఆశ్రయించి రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే బెయిల్ విషయంలో కేసుకు సంబంధించిన వాస్తవాలు, మెరిట్స్‌ను పరిశీలించిన తర్వాతే కింది కోర్టు నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.
also read: మైనర్ల సోషల్ మీడియా వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. కేంద్రానికి నోటీసులు
