దేశ రాజధాని ఢిల్లీ ప్రతిష్ఠాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ సదస్సు జరగనుండగా.. ఇందుకోసం భారత్ మండపం ప్రత్యేకంగా ముస్తాబైంది. సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో భారత్ మండపం సిద్ధమైన దృశ్యాలతో కూడిన వీడియోను ప్రధాని మోదీ గురువారం ‘ఎక్స్’లో పంచుకున్నారు. ప్రపంచ దేశాల అధినేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొంటూ.. ‘బ్రిక్స్ 2026కు సర్వం సిద్ధం’ అనే సందేశాన్ని అందించారు.
ఈ సదస్సుకు పలువురు దేశాధినేతలు హాజరుకానున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో పాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ సహా సభ్య, భాగస్వామ్య, ఆహ్వానిత దేశాలకు చెందిన ప్రముఖులు ఢిల్లీకి రానున్నారు.
2026 సంవత్సరానికి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వహిస్తోంది. ‘సుస్థిరత, ఆవిష్కరణ, సహకారం, పునరుత్థానం కోసం నిర్మాణం’ అనే ప్రధాన థీమ్‌తో ఈ ఏడాది కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మానవ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రధాని మోదీ దృక్పథానికి అనుగుణంగా ఈ థీమ్‌ను రూపొందించారు.
బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచడం, అలాగే ప్రపంచం, ప్రాంతీయ స్థాయిలో కీలకంగా మారిన అంశాలపై చర్చించడం ఈ సదస్సులో ప్రధానంగా ఉండనుంది.
సదస్సు దృష్ట్యా ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాయి. సుమారు 15 వేల మంది పోలీస్ సిబ్బందితో పాటు 200 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. వీవీఐపీ రాకపోకల నేపథ్యంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు అధికారులు ప్రజలకు సూచించారు.
బ్రిక్స్ కూటమిలో భారత్ వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. గతంలో 2012, 2016, 2021 సంవత్సరాల్లో అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన భారత్.. ఇప్పుడు నాలుగోసారి ఈ బాధ్యతను చేపట్టింది. 2026లో బ్రిక్స్ ఏర్పాటై రెండు దశాబ్దాలు పూర్తవుతుండటం కూడా ఈ ఏడాది సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకొచ్చింది.
ఈ ఏడాది జనవరి 1న బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్ ఇప్పటివరకు 350కి పైగా సమావేశాలు, ఉన్నతస్థాయి కార్యక్రమాలను నిర్వహించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. కూటమి దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత్ తన అధ్యక్షతను కొనసాగిస్తోంది.
also read: సచిన్‌కు ఆ బ్యాట్‌తో అంత ప్రత్యేక అనుబంధమా? అసలు కారణం ఇదే!
