హైదరాబాద్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, హోమ్ ల్యాండ్ గ్రూప్ అధినేత బానాల రాంరెడ్డి (48) ఆత్మహత్య చేసుకున్నారు. పటాన్చెరులో భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు చేపట్టేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడం, ఈ క్రమంలో తీసుకున్న అప్పులు భారంగా మారడంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నెదునూరు గ్రామ శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో బుధవారం రాంరెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. ఆయన డ్రైవర్ సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. బంధువు కోడూరు ప్రవీణ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కందుకూరు పోలీసులు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇన్స్పెక్టర్ హెచ్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.
250 ఎకరాల్లో భారీ ప్రాజెక్టు
కందుకూరుకు చెందిన రాంరెడ్డి కొంతకాలంగా హైదరాబాద్‌లోని మణికొండ-గచ్చిబౌలి ప్రాంతంలో నివసిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 2018లో పటాన్చెరు ప్రాంతంలో దాదాపు 250 ఎకరాల్లో భారీ ప్లాట్ల అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
ఈ ప్రాజెక్టు కోసం భాగస్వాములతో 60:40 లాభాల వాటా ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ప్రాజెక్టు కోసం మార్కెట్లో సుమారు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు అప్పులు చేసినట్లు పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ఆధారంగా తెలుస్తోంది.
భూ యజమానులతో వివాదం
ప్రాజెక్టు కోసం భూ యజమానులతో చేసుకున్న ఒప్పందాలు పూర్తిస్థాయిలో అమల్లోకి రాకపోవడంతో సమస్య మొదలైనట్లు తెలుస్తోంది. పలుమార్లు ప్రయత్నించినప్పటికీ కొందరు భూ యజమానులు అవసరమైన చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేయడానికి ముందుకు రాలేదని సమాచారం. మరికొందరు ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని కోరినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో భారీగా పెట్టుబడి పెట్టిన రాంరెడ్డికి ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లడం కష్టంగా మారింది. మరోవైపు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో గత కొన్ని నెలలుగా ఆయన తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.
సూసైడ్ నోట్, వాయిస్ మెసేజ్ స్వాధీనం
రాంరెడ్డి ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాయడంతో పాటు వాయిస్ మెసేజ్ కూడా రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన మరణానికి కారణమయ్యారని భావించిన కొందరి పేర్లను అందులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్ల కోణం ఉందంటూ కొన్ని కథనాలు వెలువడినప్పటికీ.. దీనిపై పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు. ప్రస్తుతం భూ యజమానులతో ఉన్న వివాదాలు, ఆర్థిక ఇబ్బందుల కోణంలోనే ప్రధానంగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, సూసైడ్ నోట్, వాయిస్ మెసేజ్‌తో పాటు ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
also read: ఈడీ మెరుపు సోదాలు.. హైదరాబాద్‌లో ఏఎంఆర్ గ్రూప్ కార్యాలయాలపై తనిఖీలు
