క్రైమ్ మిర్రర్ : భూమి విషయంలో తండ్రి, కుమారుడి మధ్య నెలకొన్న వివాదం చివరకు దారుణ హత్యకు దారితీసింది. ఆస్తిని తన పేరుపై రాయాలని తండ్రిపై ఒత్తిడి తెచ్చిన కుమారుడు.. మాటామాటా పెరగడంతో తండ్రిపై రాయితో దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం దూసకల్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
మూడు ఎకరాల భూమి విషయంలో వివాదం
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దూసకల్ గ్రామానికి చెందిన భాగం పోచయ్య (70)కు సుమారు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయనకు కుమారుడు భాగం మల్లేష్ ఉన్నాడు. మల్లేష్ కొంతకాలంగా మద్యానికి బానిసైనట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ అవసరాలు, ఇతర ఖర్చుల పేరుతో ఇప్పటికే తండ్రికి చెందిన భూమిలో కొంత భాగాన్ని విక్రయించినట్లు సమాచారం. అయితే మిగిలి ఉన్న భూమిని కూడా తన పేరుపై చేయాలని మల్లేష్ తండ్రి పోచయ్యపై ఒత్తిడి తెస్తూ ఉండేవాడని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంలో తండ్రీకొడుకుల మధ్య తరచూ గొడవలు జరిగేవని పేర్కొన్నారు.
మనవళ్ల భవిష్యత్తు కోసం తండ్రి నిరాకరణ
మిగిలిన భూమిని కూడా విక్రయిస్తే కుటుంబానికి ఎలాంటి ఆస్తి మిగలదని పోచయ్య ఆందోళన చెందేవాడని తెలుస్తోంది. ముఖ్యంగా తన మనవళ్లు, మనవరాలి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భూమిని కాపాడాలని భావించినట్లు సమాచారం. భూమిని పూర్తిగా విక్రయించకుండా కుటుంబ భవిష్యత్తు కోసం ఉంచాలని కుమారుడికి పలుమార్లు నచ్చజెప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ మల్లేష్ తన డిమాండ్‌ను కొనసాగిస్తూ తండ్రితో వాగ్వాదానికి దిగేవాడని సమాచారం.
అర్ధరాత్రి మరోసారి గొడవ
ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి తండ్రీకొడుకుల మధ్య మరోసారి భూమి విషయంలో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో మల్లేష్ తీవ్ర ఆగ్రహానికి గురై అక్కడే ఉన్న గనేటు రాయితో తండ్రి పోచయ్య తలపై బలంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో పోచయ్యకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయం తీవ్రంగా ఉండటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వృద్ధుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పోలీసుల దర్యాప్తు
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు అసలు కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులు, నిందితుడి పాత్ర తదితర అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్థానికులను ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. భూమి, ఆస్తి విషయంలో తండ్రీకొడుకుల మధ్య గతంలో జరిగిన వివాదాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read : తండ్రిని రాయితో కొట్టి చంపిన కుమారుడు…! ఆ ప్రాంతంలో కలకలం..
