క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. కొద్దిరోజుల్లోనే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఆరువేల పోస్టులను భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి రేవంత్ సర్కారు కసరత్తును ముమ్మరం చేసింది. వివిధ శాఖల నుంచి అందిన ఖాళీల వివరాలను సమీక్షించేందుకు టీజీపీఎస్సీ పాలక మండలి త్వరలోనే సమావేశం కానుంది. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం దాదాపు ఆరు వేలకుపైగా పోస్టులు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి.
కీలక ప్రభుత్వ శాఖల్లో భారీగా ఖాళీలు..
గత కొన్నేళ్లుగా వివిధ ప్రభుత్వ శాఖల్లో భారీగా ఖాళీలు ఏర్పడడంతో పాలనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా విద్యాశాఖలో ఉన్న ఖాళీల వల్ల బోధనలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆయా ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం భర్తీ చేయాలని భావిస్తున్న ఖాళీలు జాబితాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 1,000కిపైగా, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 300కుపైగా అధ్యాపక పోస్టులు, డైట్ (డీఐఈటీ) కాలేజీల్లో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో 100కిపైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులు, వ్యాయామ ఉపాధ్యాయుల (పీఈటీ) ఖాళీలతోపాటు దేవాదాయ శాఖ, అటవీ శాఖ, సర్వే సెటిల్‌మెంట్, టీజీ ఆర్టీసీ, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కూడా పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నిరుద్యోగులు ఒకేసారి అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని ఆందోళన చెందకుండా ఉండేందుకు, ప్రతి రెండు వారాల కోసారి ఒక నోటిఫికేషన్ చొప్పున విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. అలాగే ఒకే తేదీలో రెండు ఉద్యోగ నియామక పరీక్షలు రాకుండా షెడ్యూల్‌ను రూపొందిస్తోంది. ఇక ఇప్పటికే ప్రభుత్వం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని పదేళ్లు పెంచి, 44 ఏళ్లకు చేర్చిన సంగతి తెలిసిందే. రాబోయే నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే వారంతా తప్పనిసరిగా టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌ను అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల నిరుద్యోగులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేసి నిరుద్యోగులకు మేలు చేయాలని కోరుతున్నారు.