హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రజలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను రైల్వే బోర్డు తిరస్కరించింది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ సేవలు భారీ నష్టాలతో నడుస్తున్నందున ఉచిత ప్రయాణాన్ని అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ పథకాన్ని అమలు చేయాలంటే ఇప్పటి వరకు వచ్చిన నష్టాలతో పాటు భవిష్యత్తులో వచ్చే అదనపు ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని రైల్వే బోర్డు తెలిపింది. అలాగే ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను కూడా ముందుగా చెల్లించాలని సూచించింది.
ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం ప్రతిపాదన
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ ప్రయాణికులకు ఉచిత ప్రయాణం ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇందుకోసం ప్రయాణికుల ద్వారా ప్రస్తుతం వస్తున్న ఆదాయాన్ని ప్రభుత్వం రైల్వేకు చెల్లిస్తుందని కూడా తెలిపింది. ఈ మేరకు ఒక ముసాయిదా ఎంవోయూ రైల్వే బోర్డుకు పంపించగా, దానిపై బోర్డు తన అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా వెల్లడించింది. ఎంఎంటీఎస్ నిర్వహణ ఇప్పటికే పెద్ద ఆర్థిక భారంగా మారింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ సేవల నిర్వహణకు రూ.179 కోట్లు ఖర్చు కాగా, ఆదాయం మాత్రం కేవలం రూ.16.81 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో ఒక ఏడాదిలోనే సుమారు రూ.162 కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు తెలిపింది.
రూ.490 కోట్లకు పైగా బకాయిలు
ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ కు సంబంధించి రూ.490 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని రైల్వే బోర్డు గుర్తు చేసింది. ఈ బకాయిలను ముందుగా చెల్లించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో పూర్తి ఆర్థిక హామీలు లేకుండా ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఇకపై ఈ అంశంపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రైల్వే శాఖతో సమావేశం కానున్నట్లు సమాచారం.