క్రైమ్ మిర్రర్ : ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్న ర్యాలీ అనంతరం జరిగిన శుద్ధీకరణ కార్యక్రమంపై రాజకీయ దుమారం రేగింది. రామ్‌లీలా గ్రౌండ్‌లో కాంగ్రెస్ కార్యక్రమం ముగిసిన తర్వాత శుద్ధీకరణ పేరుతో హోమం నిర్వహించడంపై ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటన దేశంలో సామాజిక విభజనలకు దారితీసే చర్యగా ఆయన విమర్శించారు.
ఖర్గే మాట్లాడుతూ.. మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దళితుల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతోందని, ఒక రాజకీయ కార్యక్రమం జరిగిన ప్రదేశాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజాసమావేశాల కోసం ఉద్దేశించిన మైదానాల్లో అన్ని రాజకీయ పార్టీలు కార్యక్రమాలు నిర్వహిస్తాయని, అలాంటి ప్రదేశంలో ఒక పార్టీ కార్యక్రమం అనంతరం ప్రత్యేకంగా శుద్ధీకరణ చేయడం సరికాదని అన్నారు. ఈ చర్య హిందూ మతానికి కూడా వ్యతిరేకంగా ఉందని ఖర్గే వ్యాఖ్యానించారు. వివిధ వర్గాల మధ్య వివాదాలు సృష్టించడం ద్వారా దేశంలో చీలికలు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
ఈ అంశాన్ని ఖర్గే పార్లమెంటులోనూ ప్రస్తావించారు. తాను రామ్‌లీలా మైదానంలో ప్రసంగించిన సమయంలో ఏ రాజకీయ పార్టీని విమర్శించలేదని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, తన ర్యాలీ అనంతరం బీజేపీకి అనుకూలంగా ఉన్నవారు శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించారని ఆరోపించారు. కాగా, రాజ్యసభలో ఈ అంశంపై బీజేపీ ఎంపీ జేపీ నడ్డా స్పందించారు. ర్యాలీ అనంతరం జరిగిన శుద్ధీకరణ కార్యక్రమం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఆ కార్యక్రమంలో తమ పార్టీకి చెందిన ఎవరూ పాల్గొనలేదని స్పష్టం చేశారు. ఘటనపై విచారణ జరుపుతామని సభలో హామీ ఇచ్చారు.
ఈ వివాదానికి కారణమైన ఘటన ఆగస్టు 10న చోటుచేసుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అంతకుముందు శనివారం హల్ద్వానీ మైదానంలో ‘విజయ్ శంఖనాద్’ పేరుతో నిర్వహించిన ర్యాలీలో ఖర్గే పాల్గొని ప్రసంగించారు. రెండు రోజుల తర్వాత శ్రీరామ సేన అనే సంస్థ అక్కడ శుద్ధీకరణ హోమం నిర్వహించినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ నేతలు దీనిపై తీవ్రంగా స్పందిస్తుండగా, బీజేపీ మాత్రం ఈ కార్యక్రమంతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
also read : లడఖ్‌లో వరుస భూకంపాలు.. గంటల వ్యవధిలో రెండుసార్లు ప్రకంపనలు
