క్రైమ్ మిర్రర్ : నగరంలోని అబిడ్స్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఓ మహిళను కారు ఢీకొనడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ప్రమాదంలో మహిళ కాలుకు ఫ్రాక్చర్ అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల ప్రకారం.. గన్‌ఫౌండ్రీలోని ఎస్‌బీఐ బ్యాంకులో హౌస్‌కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న సునీత బుధవారం విధులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి ఆమెను ఢీకొట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రమాదానికి గురైన సునీత రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. ముఖ్యంగా కాలికి బలమైన గాయం కావడంతో ఫ్రాక్చర్ అయినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ సునీతకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. సినిమా నిర్మాత బొమ్మకు మురళికి చెందిన కారును ఆయన డ్రైవర్ మహానంద నడుపుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఆరోపించారు. ప్రమాదం అనంతరం నిర్మాత మురళికి ఫోన్ చేసి సునీత వైద్య ఖర్చులు భరించాలని కోరినట్లు తెలిపారు.
అయితే చికిత్స ఖర్చులు చెల్లించేందుకు ఆయన నిరాకరించారని, తమతో దురుసుగా మాట్లాడినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న అబిడ్స్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, కారు నడుపుతున్న వ్యక్తి వివరాలు, ఘటన సమయంలో వాహనం వేగం తదితర అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
also read : నా ర్యాలీ తర్వాత శుద్ధీకరణ హోమం.. రాజ్యసభలో ఖర్గే తీవ్ర ఆరోపణలు
