Homeతెలంగాణపోచారం యూటర్న్...!

పోచారం యూటర్న్…!

  • కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి

  • గులాబీ పార్టీ వైపు తిరిగి చూపు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పెద్దాయన పోచారం శ్రీనివాస్ రెడ్డి మనసు మారుతోందా? అనవసరంగా కాంగ్రెస్ లోకి వచ్చానని బాధపడుతున్నారా? తిరిగి గులాబీ బాస్ పిలిస్తే వెళ్ళిపోవాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని ఆయన అనుచరులు వద్ద బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమిస్తే హస్తం పార్టీకి సైతం గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

కాంగ్రెస్ లో దక్కని గౌరవం
తెలంగాణలోని పోచారం శ్రీనివాస్ రెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్. మొన్నటి ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి బాన్సువాడ నుంచి గెలిచారు. అయితే ఏదేదో ఊహించుకొని అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా రేవంత్ సర్కార్ నియమించింది. మంత్రిగా, స్పీకర్ గా పనిచేసిన ఆయనకు వ్యవసాయ సలహాదారుడని పదవి కేవలం అలంకారం మాత్రమే. అయితే గులాబీ పార్టీలో ఎంతో గౌరవం పొందిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సాధారణ ఎమ్మెల్యే అయ్యారు. దీంతో తన మాటకు కనీస విలువ లేకపోవడంతో ఆయన తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ముఖ్యంగా సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధుల విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్యం పోచారం శ్రీనివాస్ రెడ్డికి కోపం తెప్పించిందట. నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? అంటూ ఆయన తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. నిధుల కోసం 20 సార్లు మంత్రిని అడిగితే కనీసం స్పందించడం లేదన్నారు. కనీసం ఫోన్ కాల్స్ కూడా మంత్రులు రిసీవ్ చేసుకోకపోవడం పై ఆయన తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బాహటంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆయన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆయన తీరు చూస్తుంటే తిరిగి గులాబీ పార్టీలో చేరిపోతారా అనే అనుమానాలు కలుగుతున్నాయట.

27 ఏళ్ల పాటు టిడిపిలో..
తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆ పార్టీ ద్వారానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1984లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పంచాయితీరాజ్, గృహ నిర్మాణం, గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి గెలిచారు. 1999లో సైతం తన విజయాన్ని కొనసాగించారు. 2004లో మాత్రం ఆయన ఓడిపోయారు. 2009లో తిరిగి గెలిచారు. 27 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 2011లో మాత్రం కెసిఆర్ పిలుపుతో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అయితే ఆయన రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. 2014లో అదే టిఆర్ఎస్ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు.. కెసిఆర్ మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. 2018లో మూడోసారి టిఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన పోచారం శాసనసభ స్పీకర్ అయ్యారు. 2023లో గులాబీ పార్టీ తరపున బాన్సువాడ నుంచి ఐదోసారి గెలిచి రికార్డు సృష్టించారు. కానీ కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. ఇప్పుడు ఆయన పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తిరిగి గులాబీ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు