-
రాష్ట్రంలో గాడి తప్పుతున్న శాంతి భద్రతలు
-
పోలీస్ శాఖ పనితీరుపై అనేక ప్రశ్నలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు హోం మంత్రి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం హోమ్ శాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉంది. అభివృద్ధితోపాటు సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. కానీ కీలకమైన శాంతిభద్రతల విషయంలో అడుగడుగునా వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ శాఖలో అవినీతి ఘటనలు వెలుగు చూస్తుండడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. తక్షణం హోం శాఖను మంత్రికి బదలాయించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకునే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రతికూల పరిస్థితుల్లో..
ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండుసార్లు వెనుకబడిన ఆ పార్టీ.. రేవంత్ రెడ్డి నేతృత్వంలో దూకుడుగా వ్యవహరించడంతో ప్రజలు గుర్తించి అధికారం కట్టబెట్టారు. కానీ కీలకమైన శాంతిభద్రతల పర్యవేక్షణ, లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం అనుకున్న స్థాయిలో పరిణితి కనబరచడం లేదు. హోం శాఖను రేవంత్ రెడ్డి తన వద్ద పెట్టుకున్నారు. దీంతో పోలీస్ శాఖలో వెలుగు చూస్తున్న వైఫల్యాలు రేవంత్ ఖాతాలో పడుతున్నాయి. ఆయన మేల్కొని హోం శాఖను మంత్రికి బదలాయిస్తే మేలన్న అభిప్రాయం తెలంగాణ సమాజం నుంచి వినిపిస్తోంది.
జాడ లేని ఫ్రెండ్లీ పోలీస్..
తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ అనేది లేదని ప్రధాన విమర్శ. ఇటీవల మానవ హక్కుల కమిషన్ కూడా ఈ విషయాన్ని గుర్తు చేసి ఆక్షేపించింది. అయితే తాజాగా ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక చిన్న కేసులో లిక్కర్ బాటిల్లను లంచంగా కోరడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. సహజంగా ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వారి దగ్గర డబ్బులు తీసుకోవడమే నేరం.. అటువంటిది ఏకంగా లిక్కర్ బాటిల్ లంచంగా కోరారు రంగారెడ్డి జిల్లా మీర్ పేట ఎస్సై నాగభూషణం. ఈ ఘటనతో తెలంగాణ పోలీస్ శాఖ పరువు పోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అధికారులు ఆ అధికారిపై చర్యలు తీసుకున్నారు. కానీ ఏకంగా సీఎం రేవంత్ వద్ద ఉన్న శాఖలో ఇటువంటి ఘటనలు జరగడం విమర్శలకు తావిస్తోంది. కచ్చితంగా వీటికి రేవంత్ సమాధానం చెప్పాలన్న డిమాండ్ పెరుగుతోంది.
ధీమా మంచిదే కానీ…
తాము బాగా పాలిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోందని చెబుతోంది. సంక్షేమ పథకాలతో ప్రజల్లో సంతృప్తి ఉందని కూడా అంచనా వేస్తోంది. సో అంతా ఓకే. కానీ శాంతి భద్రతలను పరిరక్షించే పోలీస్ శాఖలో అవినీతిని ప్రజలు హర్షించరు. ఇటీవల కోర్టులు సైతం పోలీస్ శాఖ పనితీరును ఆక్షేపిస్తున్నాయి. వీటిని ఇలానే ఉపేక్షిస్తే మూల్యం చెల్లించుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే రేవంత్ అత్యవసరంగా హోం శాఖకు ప్రత్యేకంగా ఒక మంత్రిని నియమించడం.. లేకుంటే ఇప్పటికే ఉన్న మంత్రుల్లో ఒకరికి హోం శాఖ ఇవ్వడం అనివార్యం. లేకుంటే మాత్రం ఇబ్బందికరమే.
