బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ: పార్ట్ 1’ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమాపై తాజాగా న్యాయపరమైన వివాదం తెరపైకి వచ్చింది. రామాయణ ఇతిహాసంలోని కొన్ని ఘట్టాలను చిత్రంలో తప్పుగా చూపించారంటూ దాఖలైన పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఈ సినిమా ద్వారా రామాయణంలోని అసలు కథను వక్రీకరించారని, ఇలాంటి చిత్రీకరణ భవిష్యత్ తరాలపై తప్పుడు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోపిస్తూ నవంబర్ 23న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అయితే ఈ అభ్యర్థనకు న్యాయస్థానం అంగీకరించలేదు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా ఇప్పటికే విడుదలైందని, చూడాలనుకున్నవారు చూసేశారని పేర్కొంది. నిర్మాతలు తమకు తెలిసిన అవగాహనతో కథను తెరకెక్కించారని, వారి చిత్రీకరణతో ఏకీభవించని వారు తమ అభిప్రాయాలకు అనుగుణంగా మరో సినిమా రూపొందించుకోవచ్చని జస్టిస్ జాయ్మాల్య బాగ్చి అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా, ఇలాంటి అంశాలపై అత్యవసర విచారణ కోరుతూ న్యాయస్థానం సమయాన్ని వృథా చేయవద్దని పిటిషనర్ తరఫు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. ఈ పిటిషన్‌ను తక్షణ విచారణకు తీసుకోకుండా సాధారణ విచారణ ప్రక్రియలోనే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. అయితే సినిమాలోని అంశాలపై పిటిషనర్ చేసిన ఆరోపణలు నిజమా కాదా అనే విషయంపై కోర్టు ఎలాంటి నిర్ణయాన్నీ వెల్లడించలేదు.
ఇక ఈ చిత్రంలో భారీ తారాగణం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో, నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే కనిపించనున్నారు. వీరితో పాటు అరుణ్ గోవిల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
మరోవైపు ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్ల విషయంలోనూ సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన 22 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,777 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఇందులో భారత మార్కెట్ నుంచి దాదాపు రూ.1,185 కోట్ల గ్రాస్, రూ.992 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. విదేశీ మార్కెట్లలో మరో రూ.592 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదైనట్లు ప్రచారం జరుగుతోంది.
ఇలా ఒకవైపు భారీ వసూళ్లతో రికార్డుల దిశగా సాగుతున్న ‘రామాయణ’ చిత్రం.. మరోవైపు కథా చిత్రణపై దాఖలైన పిటిషన్‌తో చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు అత్యవసర విచారణకు నిరాకరించడంతో ఈ వివాదం తదుపరి విచారణలో ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
also read: యాసిడ్ విక్రయాలపై సుప్రీంకోర్టు కీలక ప్రతిపాదనలు.. ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే అమ్మకాలు!
