Homeక్రైమ్అండాల అక్రమ సేకరణ వెనుక భారీ నెట్‌వర్క్? ఫర్టిలిటీ కేంద్రాలపై పోలీసుల నజర్!

అండాల అక్రమ సేకరణ వెనుక భారీ నెట్‌వర్క్? ఫర్టిలిటీ కేంద్రాలపై పోలీసుల నజర్!

నగరంలో కలకలం రేపిన అండాల అక్రమ సేకరణ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ దందా వెనుక కొంతమంది వ్యక్తులు మాత్రమే కాకుండా, వ్యవస్థీకృత నెట్‌వర్క్ పనిచేస్తోందా? అనే అనుమానాలు పోలీసులకు బలపడుతున్నాయి. ముఖ్యంగా పేద మహిళలను ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని, డబ్బు ఆశ చూపి అండాల సేకరణకు ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఎమిరిశెట్టి దుర్గాప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు పలు కీలక వివరాలను సేకరించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరిన్ని విషయాలు వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అతడిని అదనపు కస్టడీకి తీసుకున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పోలీసులు వెల్లడించారు.

మహిళలను ఫర్టిలిటీ కేంద్రాలు, ఏఆర్టీ బ్యాంకులకు పరిచయం చేయడంలో దుర్గాప్రసాద్ పాత్ర ఏమిటన్నది ఇప్పుడు ప్రధానంగా మారింది. అతడికి ఉన్న పరిచయాలు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకొచ్చి అండాల సేకరణకు పాల్పడ్డారనే ఆరోపణలపైనా విచారణ కొనసాగుతోంది.

ఒయాసిస్ హాస్పిటల్స్ కార్యాలయంలో సోదాలు

దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లోని ఒయాసిస్ హాస్పిటల్స్ కార్పొరేట్ కార్యాలయంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ల్యాప్‌టాప్‌లు, ఇతర డిజిటల్ పరికరాలతో పాటు డోనర్లకు సంబంధించిన రికార్డులు, ఆర్థిక లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి, వాటి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

కమిషన్ల వ్యవహారంపైనా విచారణ

మహిళలను గుర్తించడం నుంచి ఫర్టిలిటీ కేంద్రాలకు పరిచయం చేయడం వరకు మధ్యవర్తులు ఏమైనా కమిషన్లు తీసుకున్నారా? ఈ వ్యవహారంలో ఏజెంట్లు, కోఆర్డినేటర్లు, ఫర్టిలిటీ కేంద్రాల నిర్వాహకుల పాత్ర ఎంతవరకు ఉంది? అనే అంశాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. మహిళల నియామకం కోసం ప్రత్యేకంగా ఏదైనా వ్యవస్థీకృత విధానం అమలు చేశారా? అన్న కోణంలోనూ ఆధారాలు సేకరిస్తున్నారు.

ఇదే సమయంలో నకిలీ పత్రాల తయారీ, వాటి ఆధారంగా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపైనా విచారణ కొనసాగుతోంది. స్వాధీనం చేసుకున్న రికార్డులు, డిజిటల్ ఆధారాలు, నిందితుల వాంగ్మూలాలను పరిశీలించిన తర్వాత ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది.

మొత్తంగా అండాల అక్రమ సేకరణ కేసును పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ దందా వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించడంతో పాటు, మహిళలను అక్రమంగా వినియోగించుకున్నారనే ఆరోపణల్లో నిజానిజాలను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.

also read: ప్రపంచ చెస్ వేదికపై తెలంగాణ యువ సంచలనం.. వుప్పల ప్రణీత్‌కు కాంస్య పతకం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు