
క్రైమ్ మిర్రర్ : మహబూబ్నగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బిస్కెట్ గొంతులో ఇరుక్కొని ఏడాది వయసున్న చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన మూసాపేట మండలం సుర్తి తండాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. సుర్తి తండాకు చెందిన మూడవత్ శ్రీను, మౌనిక దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం రాత్రి పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటుండగా.. తల్లి మౌనిక వారికి బిస్కెట్లు ఇచ్చి వంట చేసేందుకు ఇంట్లోకి వెళ్లింది.
ఈ సమయంలో ఏడాది వయసున్న చిన్నారి బిస్కెట్ తింటుండగా అది అనుకోకుండా గొంతులో ఇరుక్కుంది. దీంతో చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడి కిందపడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారిని ఆటోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఏడాది వయసులోనే కుమారుడిని కోల్పోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో సుర్తి తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
also read : బాచుపల్లిలో హిట్ అండ్ రన్.. ఆయుర్వేద థెరపిస్ట్ మృతి