గుంటూరు నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు నీడనిస్తూ నిలిచిన భారీ వేప చెట్టు ఒక్కసారిగా విరిగి పడటంతో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో కుటుంబ పెద్ద అక్కడికక్కడే మృతి చెందగా, భార్య, కుమారుడు గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
గుంటూరు నగరంలోని నగరంపాలెం ప్రాంతానికి చెందిన సాయి కృష్ణ ప్రసాద్, కొలగాని సరిత దంపతులు తమ కుమారుడు కార్తీక్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. సరిత మంగళగిరిలో సీడీపీఓగా విధులు నిర్వహిస్తూ ప్రతిరోజూ ప్రయాణం చేస్తుంటారు. గత రెండు రోజులుగా గుంటూరు నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి కూడా కుండపోత వర్షం కురవగా, శుక్రవారం తెల్లవారుజామున వర్షం తగ్గిన అనంతరం సరితను రైల్వే స్టేషన్‌లో దించేందుకు సాయి కృష్ణ ప్రసాద్ తన కుమారుడు కార్తీక్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.
ఇంటి నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే వారు గుంటూరు మెడికల్ కాలేజ్ ఎదుటకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడ ఉన్న భారీ వేప చెట్టు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో విరిగి వారి మీద పడింది. చెట్టు విరిగిన భారీ కొమ్మ నేరుగా ద్విచక్ర వాహనంపై పడటంతో సాయి కృష్ణ ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కార్తీక్ కాలు విరగగా, సరితకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టి ముగ్గురినీ సమీప ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
అయితే అప్పటికే సాయి కృష్ణ ప్రసాద్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడు కార్తీక్‌కు, సరితకు చికిత్స అందిస్తున్నారు. క్షణాల్లో జరిగిన ఈ విషాదం కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు నీడనిచ్చిన అదే చెట్టు తన భర్త ప్రాణాలు తీసిందంటూ సరిత కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఆమెను ఓదార్చేందుకు బంధువులు, సన్నిహితులు ప్రయత్నించినప్పటికీ ఆ కుటుంబం ఎదుర్కొంటున్న బాధను మాటల్లో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
భారీ వర్షాల కారణంగా చెట్లు బలహీనపడటం, ఆకస్మికంగా విరిగిపడటం వంటి ఘటనలు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాదకరంగా మారిన చెట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషాద ఘటన గుంటూరు నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ALSO READ: ఈ ముద్రికపై ఉన్న రూపం ఎవరిది..?