ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలతో రద్దైన నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. జూన్ 21న దేశవ్యాప్తంగా రీఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
జూన్ 14 నాటికి అడ్మిట్ కార్డులు విడుదల
ఈసారి పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో జరుగుతుందని చెప్పారు. విద్యార్థులకు అదనంగా 15 నిమిషాల సమయం కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పరీక్ష రాయబోయే అభ్యర్థులు తమకు అనుకూలమైన పరీక్షా కేంద్రాలను మరోసారి ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. జూన్ 14 నాటికి అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని తెలిపారు. అలాగే, ఈసారి పరీక్ష కోసం విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజు తీసుకోబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే చెల్లించిన పరీక్షా ఫీజును పూర్తిగా తిరిగి ఇస్తామని ప్రకటించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వైద్య విద్యలో ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3న నీట్ పరీక్ష నిర్వహించారు. అయితే ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఎన్టీఏ పరీక్షను రద్దు చేస్తూ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది.
వచ్చే ఏడాది నుంచి ఆన్ లైన్ లో నీట్ పరీక్ష
ఇక వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను పూర్తిగా ఆన్లైన్ విధానంలో, కంప్యూటర్ ఆధారిత సీబీటీ మోడ్ లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షల్లో పారదర్శకత పెంచడం, అక్రమాలకు అవకాశం లేకుండా చేయడం కోసం ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని చెప్పారు. ఈసారి ఎలాంటి అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గెస్ పేపర్ల రూపంలో ప్రశ్నపత్రం బయటకు వెళ్లిందన్న అనుమానాలపై విచారణ జరిపిన తర్వాతే పరీక్షను రద్దు చేసినట్లు వివరించారు. ఈ వ్యవహారంలో ఎవరైనా బాధ్యులుగా తేలితే, వారు ఎన్టీఏలో ఉన్నా బయటివారైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.