- మర్రిగూడ ఆదర్శ పాఠశాలలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు.
- విద్యార్థుల భవిష్యత్తుపై సీఐ ప్రత్యేక శ్రద్ధ
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్) : యువత భవితను మత్తు మహమ్మారి కబళించకుండా కాపాడే, బృహత్తర బాధ్యతను భుజాన వేసుకున్నారు నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు. “పోలీస్ అంటే కేసులు పెట్టడం కాదు, సమాజాన్ని మార్చడం” అని నిరూపిస్తూ, విద్యార్థులను సన్మార్గంలో నడిపించేందుకు ఆయన చేస్తున్న కృషి సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. మర్రిగూడ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, ఎస్ఐ బి.రాంబాబు ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఐ దూది రాజు విద్యార్థులతో అత్యంత ఆప్యాయంగా, ఒక తండ్రిలా మాట్లాడి వారి మనసులను గెలుచుకున్నారు. “బిడ్డల్లారా, ఇది మీ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకునే వయసు. చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.
ఒక్కసారి మత్తుకు అలవాటు పడితే మీ జీవితమే కాదు, మిమ్మల్ని నమ్ముకున్న మీ తల్లిదండ్రుల కలలు కూడా కలలగానే మిగిలిపోతాయి” అంటూ సీఐ ఉద్వేగంగా హితవు పలికారు. మత్తు పదార్థాల విక్రయం, సేవనం తీవ్రమైన నేరాలని, వీటిపై పోలీసులు నిరంతర నిఘా ఉంచారని ఆయన స్పష్టం చేశారు. “గంజాయి, డ్రగ్స్ కేసులో పట్టుబడితే మీ చదువు ఆగిపోవడమే కాదు, భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా రావన్నారు. క్రిమినల్ కేసులు మీ జీవితానికి మాయని మచ్చలా మిగిలిపోతాయని హెచ్చరించారు. విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా మత్తు పదార్థాలు ఇవ్వజూపినా, అమ్ముతున్నట్లు తెలిసినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. “భయపడవద్దు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని, మీ రక్షణ మా బాధ్యతని భరోసా ఇచ్చారు.
లక్ష్యం ఉన్నత శిఖరాలు..
“మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని అనవసర వీడియోలు చూడకండి. ఆ సమయాన్ని చదువుకు కేటాయించండి. కలెక్టర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, పోలీస్ ఆఫీసర్ కావాలన్నా అది చదువుతోనే సాధ్యం. మత్తుతో కాదు” అంటూ సీఐ దూది రాజు విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. విద్యార్థులు చదువుపైనే శ్రద్ధ పెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించి, తల్లిదండ్రులకు, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి స్వయంగా పాఠశాలలకు వచ్చి, విద్యార్థులతో గంటల తరబడి మాట్లాడి అవగాహన కల్పించడం పట్ల ప్రిన్సిపల్ వెంకటేశ్ గౌడ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
“దూది రాజు లాంటి అధికారులు ఉంటే మా పిల్లల భవిష్యత్తుకు ఢోకా ఉండదని, పోలీస్ అంటే భయం కాదు, భరోసా అనే భావనను ఆయన కల్పిస్తున్నారు” అని స్థానికులు కొనియాడారు. నాంపల్లి సర్కిల్ పరిధిలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని, పాఠశాలలు, కాలేజీల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టామని సీఐ తెలిపారు. కేవలం కేసులు పెట్టడమే కాదు, యువత దారి తప్పకుండా ముందస్తు అవగాహన కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, అధ్యాపక బృందం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.