HomeతెలంగాణKomatireddy Clarifies: మహేశ్ గౌడ్ ను తొలగించాలనలేదు.. కోమటిరెడ్డి వివరణ!

Komatireddy Clarifies: మహేశ్ గౌడ్ ను తొలగించాలనలేదు.. కోమటిరెడ్డి వివరణ!

*ఆయన నాకు ఎన్ఎస్ యుఐ నుంచి సన్నిహితుడు

*జగ్గారెడ్డి సామర్థ్యాన్ని మెచ్చుకున్నానంతే- మంత్రి కోమటిరెడ్డి

పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దుమారం రేపడంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు. మహేశ్ కుమార్ గౌడ్ ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి  తొలగించాలని తాను అనలేదన్నారు. తన మాటలను వక్రీకరించారని తెలిపారు.

అసలేం జరిగింది?

ఇటీవల సంగారెడ్డిలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగ్గారెడ్డి నిర్వహణ సామర్థ్యాన్ని మెచ్చుకున్నారు.  జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు వస్తాయని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను పలువురు పార్టీ నేతలు తప్పుబట్టారు. ఇది ప్రస్తుతం పీసీసీ చీఫ్ పదవిలో ఉన్న మహేశ్ కుమార్ గౌడ్‌ను కించపరచడమే అవుతుందన్నారు. పైగా, కోమటిరెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పీసీసీ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి.

మహేష్ కుమార్‌ గురించి నేను అలా అనలేదు!  

ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై స్పందించిన  మంత్రి కోమటిరెడ్డి, ‘‘మహేష్ కుమార్ గౌడ్ నాకు ఎన్ఎస్‌యూఐ రోజుల నుండి అత్యంత సన్నిహిత మిత్రుడు. ఆయన సారథ్యంలోనే   గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాం’’  అని తెలిపారు. మహేష్ కుమార్‌పై తాను ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని, కొందరు కావాలనే తన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి చేసిన జనసమీకరణ, కార్యక్రమ నిర్వహణ తీరు చూసి ముగ్ధుడనై, భవిష్యత్తులో ఆయనకు పీసీసీ అయ్యే అర్హత ఉందని మాత్రమే చెప్పానని తెలిపారు. ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడిని తొలగించాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, జగ్గారెడ్డి పనితీరును మెచ్చుకోవడమే తన ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు