అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కింగ్ 100’ రోజురోజుకూ ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నటి టబు ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌తో శుభాకాంక్షలు తెలిపిన మేకర్స్.. ‘మహంతి ఝాన్సీ రాణి’గా టబు పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు.
విడుదలైన గ్లింప్స్‌లో టబు లుక్ ఎంతో హుందాగా, గంభీరంగా కనిపిస్తోంది. రాజకుటుంబానికి చెందిన మహిళగా, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే శక్తిమంతమైన వ్యక్తిగా ఆమె పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మనుషుల గురించి ఆమె చెప్పే అభిప్రాయాలు పాత్రలోని వైవిధ్యాన్ని తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో కష్టాన్ని నమ్మేవారు, అదృష్టాన్ని నమ్మేవారు అంటూ మనుషులను రెండు వర్గాలుగా చూసే ఝాన్సీ రాణి.. అదృష్టంపై ఆధారపడే వ్యక్తులను అస్సలు ఇష్టపడదనే విషయం గ్లింప్స్‌లో ఆసక్తికరంగా చూపించారు.
ఇక నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది ఆగస్టులో ‘కింగ్ 100’ టైటిల్‌ను ప్రకటించిన చిత్రబృందం.. అదే సమయంలో సినిమా విడుదల తేదీని కూడా వెల్లడించింది. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు. అప్పట్లో విడుదలైన తొలి గ్లింప్స్‌లో నాగార్జున స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. డబ్బున్నవారు, డబ్బులేనివారు అంటూ సమాజాన్ని రెండు వర్గాలుగా చూసే తన పాత్ర ఆలోచనా విధానాన్ని డైలాగుల రూపంలో పరిచయం చేశారు.
డబ్బు లేనప్పుడు ఓడిపోయిన వ్యక్తిగా చూసిన సమాజమే.. సంపద వచ్చిన తర్వాత రాజుగా గుర్తించిందనే భావనతో నాగార్జున చెప్పిన మాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అయితే డబ్బు కంటే వ్యక్తిగత గుర్తింపుకే ఎక్కువ విలువ ఉంటుందని, ఆ గుర్తింపును కాపాడుకోవడానికి నిరంతరం పోరాడాల్సి ఉంటుందనే అంశం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
ఆర్.ఏ. కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, రాజా మహదేవన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
నాగార్జున మాస్ అండ్ క్లాస్ లుక్‌తో పాటు టబు రాజకీయ నేపథ్యం ఉన్న శక్తిమంతమైన పాత్రలో కనిపించనుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 24న థియేటర్లలోకి రానున్న ‘కింగ్ 100’ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
also read: తమిళ సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్.. ఇకపై రోజుకు 6 షోలు.. సీఎం విజయ్ కీలక నిర్ణయం!
