బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా, దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం: పార్ట్ వన్’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. సినిమా థియేటర్లలోకి రాకముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో భారీ వసూళ్లు సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా భారతదేశంలోనే టికెట్ల ముందస్తు విక్రయాలు రూ.100 కోట్ల మార్కుకు చేరువ కావడం విశేషం.
ట్రేడ్ వెబ్సైట్ సాక్నిల్క్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 4 ఉదయం నాటికి ఐదు రోజుల అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమా బ్లాక్ చేసిన సీట్లతో కలిపి రూ.96.56 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. బ్లాక్ చేసిన సీట్లను పక్కన పెడితే ఈ మొత్తం రూ.77.31 కోట్లుగా నమోదైంది. నవంబర్ 5 నుంచి 9వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సుమారు 83 వేల షోలకు సంబంధించి 25.65 లక్షల టికెట్లు విక్రయమయ్యాయి.
ఈ చిత్రానికి తొలి రోజు నుంచే భారీ డిమాండ్ కనిపిస్తోంది. నవంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమాకు మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.39.35 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. మొత్తం దేశీయ అడ్వాన్స్ బుకింగ్స్‌లో హిందీ వెర్షన్ వాటా సుమారు 82 శాతంగా ఉంది. తెలుగు, కన్నడ భాషల్లోనూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
మహారాష్ట్ర, ఢిల్లీ-ఎన్సీఆర్, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో టికెట్లకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణ షోలతో పాటు 3డీ, ఐమ్యాక్స్ ఫార్మాట్లలోనూ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రూ.100 కోట్ల మార్కును దాటినట్లు సమాచారం.
నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. సన్నీ డియోల్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ తారాగణం, ప్రతిష్ఠాత్మక నిర్మాణం, రామాయణ ఇతిహాసం నేపథ్యం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలోనూ అడ్వాన్స్ బుకింగ్స్‌తో ప్రభావం చూపుతున్న ఈ చిత్రం.. విడుదల సమయానికి భారతదేశంలోనూ రూ.100 కోట్ల ప్రీ-రిలీజ్ బుకింగ్స్ మైలురాయిని అందుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
also read: యలమంచిలిలో టీడీపీ–జనసేన వర్గాల మధ్య ఘర్షణ.. ఎన్నికల ఫలితంతో ముదిరిన వివాదం!
