Homeజాతీయం తమిళ సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్.. ఇకపై రోజుకు 6 షోలు.. సీఎం విజయ్ కీలక నిర్ణయం!

 తమిళ సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్.. ఇకపై రోజుకు 6 షోలు.. సీఎం విజయ్ కీలక నిర్ణయం!

తమిళ సినీ పరిశ్రమకు తమిళనాడు ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలోని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్తగా విడుదలయ్యే తమిళ సినిమాల ప్రదర్శనల సంఖ్యను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు రోజుకు ఐదు షోలకే పరిమితమైన వెసులుబాటును ఆరు షోలకు పెంచుతూ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. కొత్త సినిమా విడుదలైన తొలి ఏడు రోజుల పాటు థియేటర్లలో రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకోవచ్చు. ఈ షోలను ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నిర్వహించుకునే అవకాశం కల్పించారు. అంతేకాకుండా స్థానిక పండుగలు, ప్రభుత్వ సెలవులు, శని, ఆదివారాల్లోనూ ఆరు షోలకు అనుమతి ఇచ్చారు.

సినీ సంఘాల విజ్ఞప్తికి సానుకూల స్పందన

కొత్త సినిమాల విడుదల సమయంలో షోల సంఖ్య పెంచాలని తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలు సంఘాలు కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తమిళనాడు థియేటర్ అండ్ మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాయి. తొలి వారంలో సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఆదరణ లభిస్తుందని, అదనపు షోలతో నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యాజమాన్యాలకు ఆర్థికంగా మేలు జరుగుతుందని వివరించాయి. సంబంధిత వర్గాలతో చర్చించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

నాలుగు షోల నుంచి ఆరు షోల వరకు..

1957 నాటి తమిళనాడు సినిమాస్ (రెగ్యులేషన్) నిబంధనల ప్రకారం గతంలో థియేటర్లలో రోజుకు నాలుగు షోలకు మాత్రమే అనుమతి ఉండేది. అనంతరం ప్రస్తుత ప్రభుత్వం కొత్త సినిమాల తొలి వారం, పండుగలు, ప్రభుత్వ సెలవులు, వారాంతాల్లో ఐదు షోలకు అనుమతించింది. తాజాగా మరో అడుగు ముందుకేసి ఆ సంఖ్యను ఆరుకు పెంచింది.

ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో తమిళ సినిమా రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి విజయ్‌కు సినీ వర్గాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి.

also read: విడుదలకు ముందే ‘రామాయణం’ రికార్డుల వేట.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.100 కోట్లకు చేరువ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు