క్రైమ్ మిర్రర్ : ఢిల్లీలోని ఓ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. తరగతి గదిలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పాఠశాల వర్గాల్లో కలకలం రేగింది. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
వివరాల్లోకి వెళితే.. గేమ్స్ పీరియడ్ ముగిసిన అనంతరం బాలిక తరగతి గదిలోకి వచ్చింది. అలసటగా కనిపించిన ఆమె కొద్దిసేపటికే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన ఉపాధ్యాయురాలు బాలికను కుర్చీలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నించినా ఎలాంటి స్పందన రాలేదు. అనంతరం పాఠశాల సిబ్బంది ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
బాలిక గుండెపోటుతో మృతి చెంది ఉండవచ్చని పాఠశాల ప్రిన్సిపాల్ భావన మలిక్ తెలిపారు. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లామని, పాఠశాలలో నర్సు కూడా అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. బాలిక గడ్డానికి గాయం అయిన విషయాన్ని కూడా గుర్తించినట్లు వెల్లడించారు.
మరోవైపు తమ కుమార్తెకు పాఠశాల సిబ్బంది సరైన ప్రాథమిక వైద్యం అందించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాలిక కుప్పకూలిన వెంటనే సీపీఆర్ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. గడ్డానికి తగిలిన గాయం కారణంగా బాలిక స్పృహ కోల్పోయి ఉంటుందని భావించామని పాఠశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : కస్తూర్బా పాఠశాల విద్యార్థిని మృతి.. నలుగురు ఉద్యోగులపై వేటు
